కొత్త మోసాలు మెుదలుపెట్టిన ఇన్సూరెన్స్ ఏజెంట్స్.. ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందో చూడండి?

కొత్త మోసాలు మెుదలుపెట్టిన ఇన్సూరెన్స్ ఏజెంట్స్.. ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందో చూడండి?

ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతం మలబార్ హిల్. అక్కడ నివసించే 73 ఏళ్ల నాగేంద్ర శర్మ, ఆయన భార్య అల్క ప్రశాంతమైన విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఇబ్బంది పడకూడదని.. 2021లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన షుమైలా అన్సారీ అనే మహిళా ఏజెంట్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు.

కంపెనీ ప్రతినిధిగా నమ్మబలికిన అన్సారీకి శర్మ దంపతులు ప్రతి ఏటా క్రమంతప్పకుండా ప్రీమియం డబ్బులు చెల్లించేవారు. ఆమె కూడా వారికి నకిలీ రశీదులు, పాలసీ పత్రాలను అందిస్తూ నమ్మకంగా నటిస్తూ వచ్చింది. అలా మూడేళ్లలో దాదాపు రూ.లక్షా 16వేలు ప్రీమియం ఆమె చేతిలో పెట్టారు. తమకు ఇన్సూరెన్స్ ఉందనే ధీమాతో ఆ వృద్ధ దంపతులు ఉన్నారు.

కానీ ఈ ఏడాది మార్చి 5న అల్క తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో సైఫీ ఆసుపత్రిలో చేరడంతో కథ అడ్డం తిరిగింది. చికిత్స అనంతరం క్యాష్‌లెస్ సదుపాయం కోసం శర్మ ఫ్యామిలీ హాస్పిటల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ని సంప్రదించింది. అక్కడ వారు ఇచ్చిన పాలసీ నంబర్‌ను పరిశీలించిన సిబ్బంది. అసలు అలాంటి పాలసీయే తమ రికార్డుల్లో లేదని చెప్పారు. దాంతో ఆ వృద్ధ దంపతుల గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.

ALSO READ : స్థిరంగా వెండి.. దిగొచ్చిన గోల్డ్ రేట్లు..

కంగారుపడిన శర్మ ఏజెంట్ అన్సారీకి ఫోన్ చేయగా.. తాను ఈద్ పండుగ కోసం దుబాయ్‌లో ఉన్నానని, పాలసీ అంతా సక్రమంగానే ఉందని అబద్ధాలు చెప్పింది. ప్రస్తుతానికి ఆసుపత్రి బిల్లు కట్టేయమని, వచ్చాక రీఇంబర్స్‌మెంట్ చేయిస్తానని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన శర్మ రూ.2లక్షల 50వేలు అప్పుచేసి మరీ బిల్లు చెల్లించారు. ఆ తర్వాత అన్సారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి మాయమైపోయింది.

మోసపోయినట్లు గ్రహించిన శర్మ ఫ్యామిలీ నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా.. అన్సారీ ఇచ్చినవన్నీ నకిలీ డాక్యుమెంట్లని తేలింది. చివరకు వారు మలబార్ హిల్ పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 ప్రకారం క్రిమినల్ నమ్మకద్రోహం, ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి.

ఇలాంటి నకిలీ బ్రోకరేజ్ ముఠాలు తక్కువ ధరలకే ఇన్సూరెన్స్ అంటూ అమాయకులను ముంచేస్తున్నాయని ముంబై క్రైమ్ బ్రాంచ్ హెచ్చరించింది. ఏజెంట్లు ఇచ్చే డాక్యుమెంట్లను గుడ్డిగా నమ్మకుండా.. పాలసీ తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో వివరాలను సరిచూసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. సో ఇన్సూరెన్స్ కొన్నాం అనే భరోసాతో ఉండకుండా అది యాక్టివేట్ అయ్యిందని నిర్థారించుకోండి.