ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి మమత పిలుపు..జూన్ లో సమావేశం జరిగే చాన్స్

ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి మమత పిలుపు..జూన్ లో సమావేశం జరిగే చాన్స్
  •     తన రాజకీయ భవిష్యత్తు, కూటమి బలోపేతం దిశగా ప్రయత్నాలు
  •     మమత పిలుపుపై స్పందించని కూటమిలోని ప్రధాన పార్టీలు

    
న్యూఢిల్లీ: బెంగాల్ ​మాజీ  సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్​ మమతా బెనర్జీ ఇండియా కూటమి రీసెట్​ బటన్​ నొక్కారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత.. అలాగే, కూటమిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. 

కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్​ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్‌‌‌‌ ఎన్నికల్లో టీఎంసీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో దీదీ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 215 సీట్లు సాధించిన టీఎంసీ, ఈసారి కేవలం 80 సీట్లకే పరిమితమైంది. 

అంతేకాకుండా, మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌‌‌‌లో తన మాజీ అనుచరుడు, బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. గత 15 ఏండ్లుగా బెంగాల్‌‌‌‌లో ఒంటరిగా బీజేపీని ఎదుర్కొంటూ వస్తున్న మమతా బెనర్జీకి ఈ ఓటమి పెద్ద షాక్. ఈ నేపథ్యంలో, తన రాజకీయ భవిష్యత్తును, కూటమిని బలోపేతం చేయడానికి ఆమె ఢిల్లీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. 

ముఖ్యంగా ఆమె కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మమతా బెనర్జీ సమావేశానికి పిలుపునిచ్చినప్పటికీ కూటమిలోని మిగతా ప్రధాన పార్టీల నేతల నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాలేదు. ఈ సమావేశం గురించి తమకు ఇంకా ఎలాంటి సమాచారం లేదని.. అయితే, జూన్ లో ఇండియా కూటమి సమావేశం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అఖిలేశ్ యాదవ్‌‌‌‌ను మమతా బెనర్జీ నేరుగా సంప్రదిస్తే సమావేశానికి తాము సిద్ధంగా ఉంటామని సమాజ్‌‌‌‌వాదీ పార్టీ పేర్కొంది. 

కాంగ్రెస్, తృణమూల్ మధ్య సందిగ్ధత

బెంగాల్​ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఫలితాల తర్వాత మమతా బెనర్జీకి మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంల అక్రమాలు, ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల వల్లే టీఎంసీకి సీట్లు తగ్గాయని కాంగ్రెస్ కూడా ఆరోపించింది. 

రాష్ట్రాల్లో ఒకరికొకరు వ్యతిరేకంగా పోటీ చేసినా, జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనే విధానాన్ని కాంగ్రెస్ సమర్థిస్తోంది. మరో వైపు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడంతో డీఎంకే, -కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. 

దీనివల్ల పార్లమెంట్‌‌‌‌లో తమకు విడిగా సీట్లు కేటాయించాలని డీఎంకే కోరింది. ఈ నేపథ్యంలో వారు కూటమిలో కొనసాగుతారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షమైన టీవీకే కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉంది. 

రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ వైఖరి పట్ల ప్రాంతీయ పార్టీలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీని బలంగా ఢీకొట్టాలంటే కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరని మమతా బెనర్జీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌‌‌‌లో జరగబోయే ఇండియా కూటమి సమావేశంపై అందరి దృష్టి నెలకొంది.