
ఆ ఊళ్లో పన్నెండు అయ్యిందంటే చాలు కొంతమంది ఒక చెట్టు కింద కూర్చుని సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో పని చేస్తుంటారు. వాళ్లేమైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లా? వర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? అంటే అదీ కాదు. వాళ్లంతా స్టూడెంట్స్, నిరుద్యోగులు, హౌజ్‌వైఫ్స్. మరి ఆ ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నారనే కదా మీ డౌటు.
రాష్ట్రంలోని ఇసుక రీచ్(ఇసుక దొరికే ప్రాంతం)లో జరుగుతున్న అక్రమాలను ఆపేందుకు తెలంగాణ స్టేట్ మినరల్స్ డెవలప్‍మెంట్ కార్పోరేషన్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదే ఎస్‍ఎస్‍ఎంఎంఎస్.. అంటే ‘శాండ్ సేల్ మేనేజ్‍మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’. దీని ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక అలాట్మెంట్స్ చేస్తున్నారు. ఇది 2017 జులైలో అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో ఇసుక అవసరమైన వాళ్లు టీఎస్‌ఎమ్‌డీసీ పోర్టల్‌లో లారీ నెంబర్ ఎంటర్ చేసి బుక్ చేసుకోవాలి. డబ్బులు కూడా ఆన్‌లైన్‌లోనే పే చెయ్యాలి. ఆ తర్వాత ఏ లారీ నెంబర్‌తో బుక్ చేసుకున్నామో.. ఆ లారీతో రీచ్‌కి వెళ్తే అధికారులు ఇసుక నింపిస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇసుక అవసరం ఉన్న వాళ్లందరికీ ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉండదు కదా.. మరి అలాంటి వాళ్లు ఏం చేయాలి? వాళ్ల కోసమే కొంతమంది యువకులు, హౌజ్‌వైవ్స్ ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేస్తున్నారు. ఇలా చేసినందుకు కొంత డబ్బు తీసుకుంటారు. ఆన్‍లైన్‍లో ఇసుక కేటాయింపుల వల్ల రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు అరవై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతోంది.
ల్యాప్‍టాప్ ముందే..
ఏ రోజుకా రోజు రాష్ట్రంలోని అన్ని రీచ్‍లలో ఇసుక అలాట్మెంట్స్ చేస్తుంటారు. టీఎస్‍ఎండీసీ ఆన్‍లైన్ పోర్టల్‍లో.. ఏ రీచ్‍లో ఎంత ఇసుక ఉందనేది ప్రతిరోజు మధ్యాహ్నం 12గంటలకు ఆన్‌లైన్‌లో పెడతారు. ఆ వెంటనే ఎవరు ఇసుక బుక్ చేస్తే వాళ్లకు మాత్రమే దొరుకుతుంది. సరిగ్గా ఆ సమయానికి టీఎస్‍ఎండీసీ ఆన్‍లైన్ పోర్టల్‍లో ఏ రీచ్ నుంచి ఇసుక కావాలో ఆ రీచ్ పేరు మీద క్లిక్ చేయాలి. ఇలా చాలామంది చేస్తారు. కానీ.. ఎవరు ముందుగా లారీ నంబర్ ఎంటర్ చేసి, పేమెంట్ చేస్తారో వాళ్లకే ఇసుక బుక్ అవుతుంది. నిమిషాల్లోనే ఇసుక అంతా అమ్ముడుపోతుంది. అందుకే ఇసుక బుక్ చేసేవాళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ నిరుద్యోగులకు పని కల్పించింది. ఇసుక బుక్ చేసేందుకు ఒక ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటేచాలు. ఇసుక లారీల యజమానుల నుంచి లారీ నంబర్లు తీసుకుని బుక్ చేస్తారు. తర్వాత వాళ్ల దగ్గర నుంచి ఒక్కో లారీకి నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు.
ఎక్కడ చూసినా..
యాదాద్రి ప్రాంతంలో ప్రతిరోజు ఎంతోమంది యువకులు ఇసుక బుక్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఇరవై వేలకు పైగా సంపాదిస్తున్నారు. వాళ్లు ఉండేవి పల్లెటూళ్లు కావడంతో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా దొరకదు. దాంతో 12గంటలకు ముందే ల్యాప్‌టాప్‌లు తీసుకుని సిగ్నల్ బాగా ఉండే ప్రదేశాలకు వెళ్లి కూర్చుంటున్నారు. ఇలా అరగంట సేపు ల్యాప్‌టాప్ ముందు కూర్చుంటే చాలు. రోజంతా వేరే పనులు చేసుకోవచ్చు. చాలామంది ఇదే పనిచేస్తుండడంతో కొందరికి ఒక్కోరోజు ఇసుక బుక్ కాకపోవచ్చు కూడా. అధికారులు ఆన్‍లైన్‍లో అమ్మకానికి పెట్టిన క్వాంటిటీ నిమిషాల్లో అయిపోతుంది. ఇంటర్నెట్ బాగా స్పీడ్‌గా ఉన్నవాళ్లే ఎక్కువ బుక్ చేయగలరు. ఇక వర్షాకాలంలో నదులు పారుతుంటాయి. ఇసుక తక్కువగా దొరుకుతుంది. అలాంటప్పుడు బుక్ చేస్తే ఒక్కో బుకింగ్‌కు మామూలుగా వచ్చే దానికంటే చాలా ఎక్కువ డబ్బు వస్తుంది.