అంగన్​వాడీ సెంటర్ పిల్లలకూ యూనిఫామ్.. కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే

అంగన్​వాడీ సెంటర్ పిల్లలకూ యూనిఫామ్.. కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే

సూర్యాపేట, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు దుస్తులు అందించే ఆలోచన చేస్తున్నామని, ఆ ఆర్డర్​ను  కూడా మహిళా సంఘాలకే ఇచ్చేట్టు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి వారికి కుట్టు పనిలో మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో మహిళా స్వశక్తి కుట్టు మిషన్​ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి సందర్శించారు.

సందీప్​కుమార్ సుల్తానియా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 70 లక్షల జతలు యూనిఫామ్స్​ ఇవ్వనున్నామని, వాటిని కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. సంఘాల ఆధ్వర్యంలోని కుట్టు కేంద్రాల్లో ఒక్కొక్కరు రోజుకు ఏడు జతలు సిద్ధం చేస్తున్నారన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో మండలంలో కటింగ్​మెషీన్లు అందిస్తామన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మహిళలకు ట్రైనింగ్​ఇచ్చి రెడీమేడ్ దుస్తులతో 
చేయూతనందించడం జరుగుతుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళ కమిటీలు ఏర్పాటు చేశామని, త్వరలో మహిళ పాలసీ తీసుకురానున్నట్టు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూనిఫామ్స్​ కుట్టేపని 74 శాతం పూర్తయ్యిందని, గడువు తేదీ లోపు మిగతా పని పూర్తి చేస్తామన్నారు. డీఆర్డీఓ మధుసూదన్ రాజు, సీఈవో అప్పారావు, డీఈఓ అశోక్, ఏ పీడీ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.