సంగారెడ్డి టౌన్, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకుండా ఫిబ్రవరి1 నుంచి 20వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల వారీగా సర్వే నిర్వహించి పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్‌వెల్‌ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ బోర్లు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి తాగునీటి కొరత రాకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పంచాయతీ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలకు సంబంధించిన టాయిలెట్ల నిర్మాణం, కాంపౌండ్ వాల్స్, మైనర్ రిపేర్ల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చెల్లించాల్సిన కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. మహిళా సంఘాల భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే శుక్రవారం లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, ఎంపీడీవోలు కలిసి గ్రామాల్లో జాయింట్ పరిశీలనలు నిర్వహించి ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
