అప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లా

అప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్లా

న్యూఢిల్లీ: మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌తో తాను చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఇండియా టెన్నిస్‌‌ స్టార్‌‌ సానియా మీర్జా చెప్పింది. గాయం కారణంగా 2008 బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌ నుంచి వైదొలిగిన తర్వాత డిప్రెషన్‌‌లోకి వెళ్లానని తెలిపింది. నాడు  చెక్‌‌ ప్లేయర్‌‌ ఇవెతా బెనెసోవాతో ఫస్ట్‌‌ రౌండ్‌‌ మ్యాచ్‌‌లో మణికట్టు గాయానికి గురైన సానియా ఒలింపిక్స్‌‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ‘నేను చాలా సార్లు మెంటల్‌‌ ఇష్యూస్‌‌ ఎదుర్కొన్నా. టెన్నిస్‌‌లోనే కాకుండా కోర్టు బయట కూడా ఇబ్బంది పడ్డా. 34 ఏళ్ల ఏజ్‌‌లో నా ఆలోచనలు చాలా క్లియర్‌‌గా ఉన్నాయి. కానీ, 20 ఏళ్ల వయసులో అలా లేదు. నిజాయితీగా చెప్పాలంటే ఆ టైమ్‌‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌‌ను నేను చేసి ఉండకూడదు అనుకుంటున్నా.  అలాంటి ఒక ఇన్సిడెంట్‌‌.. ఒలింపిక్స్‌‌ మ్యాచ్‌‌లో నేను తప్పుకోవడం. 2008 బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌లో నా మణికట్టుకు పెద్ద గాయమైంది.  మ్యాచ్‌‌ మధ్యలోనే వైదొలగాల్సి రావడంతో  చాలా బాధ పడ్డా. ఆ తర్వాత మూడు, నాలుగు నెలలు డిప్రెషన్‌‌లోకి వెళ్లా. ఏ కారణం లేకుండానే ఏడ్చిన సందర్భాలు గుర్తున్నాయి. అప్పటిదాకా బాగానే కనిపించే నేను ఉన్నట్టుండి కన్నీళ్ల పర్యంతం అయ్యేదాన్ని.  ఓ నెల రోజుల పాటు కనీసం భోజనం చేసేందుకు కూడా నా రూమ్‌‌ నుంచి బయటికి రాలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒకదశలో నేను మళ్లీ టెన్నిస్‌‌ ఆడలేమోనని అనుకున్నా.  సహజంగా నేను అనుకున్నది చేసే రకం. కానీ, అలా జరగకపోవడాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపించింది.   20 ఏళ్ల వయసులో  నీ పనైపోయింది.. నువ్వు మళ్లీ ఒలింపిక్స్‌‌లో పోటీ పడలేవు అనే వార్తలు చదివితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని సానియా చెప్పుకొచ్చింది. బీజింగ్‌‌ ఒలింపిక్స్‌‌లో చేతికి చాలా తీవ్రం గాయం అయిందని సానియా చెప్పింది. ‘ఆ చేత్తో కనీసం జుట్టు దువ్వుకోలేకపోయా. గాయానికి సర్జరీ అవసరం అయింది. అయితే, సర్జరీ తర్వాత మరింత ఇబ్బంది కలిగింది. దాంతో, నా ఫ్యామిలీని, నా దేశాన్ని నిరాశ పరిచా అని ఫీలయ్యా. ఆ టైమ్‌‌లో నా ఫ్యామిలీ నాకు అవసరమైన హెల్ప్‌‌ చేసింది. నన్ను సరైన దిశలో నడిపించింది. ఆ తర్వాత ఇండియాలో జరిగిన కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో రెండు మెడల్స్‌‌ గెలిచా’ అని సానియా చెప్పుకొచ్చింది.