ఆస్ట్రేలియా ఓపెన్లో అన్నా డానిలినాతో కలిసి ఆడనున్న సానియా మీర్జా

ఆస్ట్రేలియా ఓపెన్లో అన్నా డానిలినాతో కలిసి ఆడనున్న సానియా మీర్జా

భారత  టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా 2023 సీజన్‌ను కొత్త పాట్నర్తో ప్రారంభించనుంది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023లో ఆమె కజకిస్తాన్ ప్లేయర్ ప్రపంచ 11వ ర్యాంకర్ అన్నా డానిలినాతో కలిసి బరిలోకి దిగనుంది. డబుల్స్ విభాగంలో సానియా పోటీపడనుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడతానని సానియా మీర్జా ఇంకా ప్రకటించలేదు. జనవరి 16న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం WTA డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా ప్రపంచంలో 25వ ర్యాంక్‌లో ఉంది.

2022 సీజన్ తర్వాత టెన్నిస్ ఆడటం మానేయాలని  సానియా మీర్జా భావించింది, అయితే ఆ తర్వాత ఆమె మనసు మార్చుకుంది. ఇక ఈ ఏడాది సానియా 16 టోర్నీల్లో పోటీపడగా... చార్ల్స్‌టన్‌ ఓపెన్, స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచింది.  ఆరు మహిళల డబుల్స్ సెమీఫైనల్స్‌లో ఆడింది. మొత్తంగా 26 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. క్రొయేషియా భాగస్వామి మేట్ పావిక్‌తో కలిసి వింబుల్డన్ 2022 మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్‌కు చేరుకుని రికార్డు సృష్టించింది. 36 ఏళ్ల సానియా ఐదేళ్ల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.

సానియా తన టెన్నిస్ కెరీర్‌లో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇందులో ఒకటి మహిళల డబుల్స్‌లో మార్టినా నవ్రతిలోవాతో, మరొకటి 2009లో మహేష్ భూపతితో మిక్స్‌డ్ డబుల్స్‌లో ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో నదియా కిచెనోక్‌తో జతకట్టింది. అయితే మొదటి రౌండ్‌లోనే ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్‌రామ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.