
- ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు
- మునుగోడు సభ తర్వాత చేరికలు ఊపందుకుంటయ్
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల భేటీలో తరుణ్ చుగ్
హైదరాబాద్, వెలుగు: పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వాటిని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ సూచించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన చుగ్.. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, బంగారు శృతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంటరీ ప్రవాసీ యోజన, జనం గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలపై రివ్యూ చేశారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల అమలుపై చర్చించారు. పార్లమెంటరీ ప్రవాసీ యోజన కార్యక్రమం ఇప్పటి వరకు ఎన్ని నియోజకవర్గాల్లో పూర్తయింది, ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో కొనసాగాల్సి ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనం గోస– బీజేపీ భరోసా కార్యక్రమం పేరుతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొనసాగుతున్న బైక్ ర్యాలీలపై ఆరా తీశారు. ఎన్ని నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో కొనసాగించాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు.
మునుగోడు సభపై రివ్యూ
ఈ నెల 21న మునుగోడులో జరగనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరవుతున్నందున.. సభ సక్సెస్, జన సమీకరణపై రాష్ట్ర పార్టీ తీసుకుంటున్న చర్యలపై తరుణ్‌చుగ్ చర్చించారు. ప్రధాన కార్యదర్శులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, మునుగోడు సభ తర్వాత బీజేపీలో చేరికలు మరింత ఊపందుకోనున్నాయని అన్నారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసినా ఎదుర్కొంటూ పోరాడుతున్నారని చెప్పారు. సంజయ్ పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తున్నదని, టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత ఈ పాదయాత్ర ద్వారా స్పష్టమవుతున్నదని అన్నారు.
ఇయ్యాల నేతలతో శివ ప్రకాశ్ భేటీ
బీజేపీ సంస్థాగత జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ గురువారం హైదరాబాద్ వచ్చారు. సంఘ్‌కు చెందిన కొందరు ప్రముఖులతో భేటీ అయిన శివ ప్రకాశ్.. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బీజేపీ నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నిక, ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బూత్ కమిటీల ఏర్పాటు, శక్తి కేంద్రాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు.