
ముంబై: మహారాష్ట్రలోని 48 లోక్‌సభ సీట్ల పంపకంపై మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తుది చర్చలు ముగిశాయని.. త్వరలోనే సంయుక్త ప్రకటన చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. కూటమిలో వంచిత్ బహుజన్ అఘాడీని కూడా కలుపుకునేందుకు ప్రకాశ్ అంబేద్కర్‌తో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆదివారం రౌత్ మీడియాలో మాట్లాడుతూ.. ఎంవీఏ భాగస్వామ్య పార్టీలు శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్), కాంగ్రెస్ సీట్ల పంపకంపై తుది చర్చలు ముగిశాయన్నారు.
ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారని పేర్కొన్నారు. సీట్ల షేరింగ్ విషయంలోని చిక్కులను పరిష్కరించామన్నారు. వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్‌తో ఎంవీఏ చర్చలు జరుపుతోందని.. ఆయన రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలన్నారు.