V6 News

IND vs SA: పొగుడుతూనే పక్కన పెట్టారుగా.. టీమిండియా ప్లేయింగ్ 11లో ఆ ఇద్దరికీ మరోసారి అన్యాయం

IND vs SA: పొగుడుతూనే పక్కన పెట్టారుగా..  టీమిండియా ప్లేయింగ్ 11లో ఆ ఇద్దరికీ మరోసారి అన్యాయం

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఇండియా ప్లేయింగ్ 11లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) జరుగుతున్న ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మరోవైపు మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్ కు కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు. వీరిద్దరూ భారత జట్టులో ఉండడానికి అర్హులైనా తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. భారత యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

ఈ మ్యాచ్ కు ముందు సంజు శాంసన్ గురించి సూర్య గొప్పగా మాట్లాడిన సంగతి తెలిసిందే. "శాంసన్ చాలా విలువైన ఆటగాడు. అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. తదుపరి రెండు సిరీస్ లలో పెద్దగా మార్పులు చేయాలని భావించడం లేదు". అని సూర్య చెప్పుకొచ్చాడు. కానీ ప్లేయింగ్ 11లో మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. శాంసన్ స్థానంలో ఓపెనర్ గా గిల్ కు అవకాశం ఇచ్చారు. మరోవైపు వికెట్ కీపర్ గా సంజును కాదని వికెట్ కీపర్ గా జితేష్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. జితేష్ మీద ఉన్న నమ్మకం శాంసన్ పై లేకపోవడం కొంచెం షాక్ కు గురి చేస్తోంది. 

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ డెప్త్ కోసం ఈ ప్రధాన స్పిన్నర్ ను పక్కన పెట్టిన టీమిండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. కుల్దీప్ బౌలింగ్ వైవిధ్యం అమోఘం. వికెట్లు తీసుకోవడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. ఎన్నో మ్యాచ్ ల్లో తన బౌలింగ్ తో విన్నింగ్ స్పెల్స్ వేశాడు. ఫార్మాట్ ఏదైనా కుల్దీప్ జట్టులో ఉండడానికి అర్హుడు. కానీ కుల్దీప్ ను మాత్రమే బెంచ్ కే పరిమితం చేశారు.
 
కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజ్ లో తిలక్ వర్మ (25), అక్షర్ పటేల్ (12) ఉన్నారు.  అభిషేక్ శర్మ (17), శుభమాన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి రెండు వికెట్లు.. సిపమాల ఒక వికెట్ తీసుకున్నాడు.