టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ టీ20ల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడనుకుంటే మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్ లాడిన సంజు.. మూడో టీ20లో బెంచ్ కు పరిమితమయ్యాడు. శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం దక్కింది. తొలి టీ20లో బ్యాటింగ్ ఆడే అవకాశం శాంసన్ కు రాలేదు. రెండో టీ20లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో శాంసన్ ను తుది జట్టు నుంచి తప్పించారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శాంసన్ కు ఇచ్చిన భరోసా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆసియా కప్ ముందు సంజు శాంసన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "ఒకసారి గంభీర్ నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగాడు. దానికి నేను నాకు వచ్చిన అవకాశాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోతున్నాను అని గంభీర్ కు చెప్పాను. దానికి గంభీర్ నువ్వు వరుసగా 21 మ్యాచ్ ల్లో డకౌట్ అయినా జట్టు నుంచి తీసేయను అని సమాధానమిచ్చాడు. ఆ మాటలకు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. జట్టులో నా స్థానం సేఫ్ అని గుర్తించా. ఆ తర్వాత నుంచి గంభీర్ చెప్పిన మాటలతో నేను భారీ స్కోర్ చేయగలిగాను". అని శాంసన్ చెప్పాడు. అయితే ఒక్క మ్యాచ్ విఫలం కాగానే శాంసన్ ను పక్కన పెట్టడంతో గంభీర్ హ్యాండ్ ఇచ్చాడనే విమర్శలు వస్తున్నాయి.
ఓపెనర్ గా అద్బుతంగా రాణిస్తున్న శాంసన్ ను గిల్ రాకతో ఆసియా కప్ లో మిడిల్ ఆర్డర్ లో ఆడించారు. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ గా వచ్చినప్పటి నుంచి శాంసన్ ఓ రేంజ్ లో ఆడుతున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అలవోకగా సెంచరీలు బాదేస్తున్నాడు. ఓపెనర్ గా తన స్థానానికి ఎలాంటి ఢోకా లేదనుకున్న సమయంలో మిడిల్ ఆర్డర్ కు పంపేశారు. మిడిల్ లో ఒక ఖచ్చితమైన ఆర్డర్ లో ఆడనివ్వకుండా అతని ఏకాగ్రత చెడగొట్టారు. ఆస్ట్రేలియాతో ఒక్క మ్యాచ్ లో విఫలం కాగానే పక్కన పెట్టారు. శాంసన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జితేష్ ఆస్ట్రేలియాపై మూడో టీ20లో రాణించాడు. 13 బంతుల్లోనే 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం (నవంబర్ 2) హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరిగిన హాయ్ స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆతిధ్య ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. భారీ ఛేజింగ్ లో వాషింగ్ టన్ సుందర్ (23 బంతుల్లో 49: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత క్యామియోతో పాటు మిగిలిన టీమిండియా బ్యాటర్లు తలో చేయి వేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ లో ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి గెలిచింది.
