హైదరాబాద్ : పదిహేను సంవత్సరాలుగా అమ్మా నాన్నా తానై పెంచిన యువతికి అంగరంగ వైభోగంగా వివాహం జరిపించారు సంకల్ప ఫౌండేషన్ వ్యవస్తాపకురాలు రోజి. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పాపిరెడ్డికాలనీలో నాయనమ్మ వద్ద ఉండే గీత ..తిండి లేక ఆమెను భిక్షాటన చేయాలని చందానగర్‌లోని ఓ హోటల్ ముందు నిలబెట్టేది నాయనమ్మ. 2005లో ఓ చోట చిత్తు కాగితాలు ఏరుకుంటుండగా.. సంకల్ప్ ఫౌండేషన్ నిర్వాహకురాలు రోజీకి గీత కంటపడింది. రోజీ తన వసతిగృహంలో ఆశ్రయం కల్పించి, పాపిరెడ్డికాలనీ శారద విద్యానికేతన్ స్కూల్ లో పదోతరగతి, మదీనాగూడ విజేత జూనియర్ కళాశాలలో ఇంటర్ వరకు చదివించారు. గీతకు వివాహం చేయాలనుకున్న రోజి… చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటూ బీకాం చదివి, హెచ్‌సీయూలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న అశోక్(నిజామాబాద్)తో గురువారం గీతకు వివాహం జరిపించింది.
ఈ సందర్భంగా సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రోజీ మాట్లాడుతూ.. ఈరోజు తనకు మరచిపోలేని రోజని ఈ విధంగా తన ముందు ఎదిగిన గీతకు విద్యాబోధనాలతో పాటు పెళ్లి జరిపించడం చాల సంతోషాన్ని కల్గించిందన్నారు. ఇందులో పలువురి సహకారం ఉందని అందరి ఆశీర్వాదాలు నూతన జంటపై ఉండాలన్నారు. గీత మాట్లాడుతూ.. 2005లో బిక్షాటన చేస్తూ చిత్తూ కాగితాలు ఏరుకుంటుండగా.. రోజీ మేడం తనకు ఆశ్రయం కల్పించడమే కాకుండా .. తల్లితండ్రుల కంటే ఎక్కువుగా మంచి విద్యాబోధనలు కల్పించారన్నారు. ఇప్పుడు పెళ్లి కూడా చేయడం జీవితంలో మరచిపోలేని రోజని.. రోజీ మేడానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది గీత.
