కారు వెనక కారు.. హైదరాబాద్, బెజవాడ హైవే ఫుల్ ట్రాఫిక్

కారు వెనక కారు.. హైదరాబాద్, బెజవాడ హైవే ఫుల్ ట్రాఫిక్

హైదరాబాద్ టూ విజయవాడ.. జాతీయ రహదారి ఎలా ఉంది అంటే.. హైదరాబాద్ సిటీలో అంత ట్రాఫిక్ ఉంది.. హైదరాబాద్ సిటీలో ఉన్నంత ట్రాఫిక్ ఉంది.. సిటీ ఖాళీ అయ్యే కొద్దీ.. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతుంది. లక్షల సంఖ్యలో వాహనాలు ఏపీ వైపు దూసుకెళుతున్నాయి. ఈ హైవేపై నల్గొండ వరకు విపరీతమైన రద్దీ ఉండగా.. అక్కడి నుంచి ఒంగోలు, నెల్లూరు వెళ్లేవారు నల్గొండ వైపు వెళుతున్నారు. ఇక పంతంగి టోల్ గేటు దగ్గర అయితే విజయవాడ వైపు ఎక్కువ బూత్ లు పెట్టారు. ఎనిమిది బూత్ లు ఓపెన్ చేసినా.. ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా.. టోల్ గేటు దాటటానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది అంటున్నారు వాహనదారులు. 

హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 300 కిలోమీటర్లు ఇదే పరిస్థితి ఉంది. కారు వెనక కారు అన్నట్లు.. బెజవాడ వరకు ట్రాఫిక్ ఉందంటున్నారు వాహనదారులు. కార్లతోపాటు ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు, టూ వీలర్స్ పై వెళ్లే వారితో హైవే మొత్తం కిటకిటలాడుతుంది. ఇక రోడ్ల పక్కన హోటల్స్, టీ స్టాల్స్ అయితే ఫుల్ రష్ గా నడుస్తున్నాయి. శనివారం సెలవు కలిసి రావటంతో.. జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచే లక్షల మంది సొంతూళ్లకు బయలుదేరివెళుతున్నారు. ఉదయం పొగ మంచు ఉండటంతో..  ఎక్కువ మంది ఆరు నుంచి ఏడు గంటల మధ్య హైదరాబాద్ సిటీలో బయలుదేరారు. దీంతో రష్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది.

ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ ఏపీలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సొంత వాహనాలు కార్లు, బైక్ లు, ఇతర వాహనాలు ఉన్నవారు తమతమ వాహనాల్లో గ్రామాలకు వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – విజయవాడ హైవే పై వాహనాల రద్దీ పెరిగింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ వల్ల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది.

ఉదయం వేళ పొంగమంచు కారణంగా హైవేపై వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఎల్బీ నగర్ నుంచి దండుమల్కాపురం వరకు ఆరు వరుసల రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మరోవైపు ఏపీ, తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి.