పల్లెలకు సంక్రాంతి కానుక.. 277 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు

పల్లెలకు సంక్రాంతి కానుక.. 277 కోట్లు రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర సర్కారు పల్లెలకు తీపికబురు అందించింది. అభివృద్ధి పనుల కోసం ఎదురుచూస్తున్న పల్లెలకు ఊరటనిస్తూ.. ఏకంగా రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రజాభవన్‌‌‌‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అత్యవసర సమావేశం నిర్వహించారు. 

సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, తక్షణ అవసరాలపై చర్చించిన అనంతరం.. నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం పచ్చజెండా ఊపారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు వెంటనే రూ.277 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నిధులు గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతర అత్యవసర పనులకు ఉపయోగపడనున్నాయి. గ్రామాల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలకు ప్రభుత్వం తరఫున ఈ నిధుల విడుదలను ఒక కానుకగా పేర్కొన్నారు. మేజర్​ గ్రామ పంచాయతీలకు పెద్ద మొత్తంలో నిధులు అందుతాయని తెలిపారు.