హైదరాబాద్‌‌ - విజయవాడ హైవేపై సంక్రాంతి రష్..ఏపీకి బాటపట్టిన వాహనాలు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్

హైదరాబాద్‌‌ - విజయవాడ హైవేపై  సంక్రాంతి రష్..ఏపీకి బాటపట్టిన వాహనాలు..కిలోమీటర్ల మేర ట్రాఫిక్

 సిటీ జనం ఊరి బాట పడుతున్నారు. స్కూళ్లకు హాలిడేస్ రావడంతో సంక్రాంతి పండుగలకు పల్లెకు పయనమవుతున్నారు.  హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొందరు  సొంత వాహనాల్లో వెళ్లడంతో సిటీ బార్డర్లో, టోల్ గేట్ల దగ్గర వాహనాలు క్యూ కట్టాయి. 

ముఖ్యంగా  విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ  మొదలైంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, సాఫ్ట్‌‌వేర్‌‌ ఉద్యోగులకు శని, ఆదివారాలు కలిసి వస్తుండడంతో  సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌ పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.  రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్‌‌ యంత్రాంగం, టోల్‌‌ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

16 టోల్ బూత్​లు

శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడం, అటు సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు వీకెండ్ కలిసి రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం భారీగా వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ వసూలు బూత్ ఉండగా విజయవాడ వైపు 8 టోల్ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఓపెన్ చేశారు. వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సిటీ ఔట్ స్కర్ట్స్ నుంచే ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి కోసం టీజీఎస్ ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులు నడుపుతున్నది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్​బీ, బోయిన్​పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పండుగ తర్వాత తిరిగి వచ్చేవారి కోసం 18, 19వ తేదీల్లోనూ ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీతో పాటు అటు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు చార్జీలు భారీగా పెంచేశారు. స్పెషల్ బస్సులు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయని, డీజిల్, మెయింటెనెన్స్ మేరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తున్నదని అధికారులు తెలిపారు. ఈ నెల 9, 10, 12, 13వ తేదీలతో పాటు తిరుగు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉండే 18, 19వ తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు కూడా చార్జీలు భారీగా పెంచేశారు.