- కన్నెపల్లి మార్గంలో వరంపట్టిన తల్లులు, శివసత్తుల పూనకాలు
- సారలమ్మ వచ్చే తొవ్వలో పోలీసుల మూడంచెల భద్రత
- తల్లుల ప్రధాన గద్దెలపై అలికి ముగ్గులుపెట్టిన ఆడబిడ్డలు
- అధికారికంగా ప్రారంభమైన మహాజాతర.. భక్తజన సంద్రంగా మేడారం
- బుధవారం 40 లక్షల మంది మొక్కులు.. నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు: జై సారక్క.. జై జై సారక్క అంటూ భక్తుల జయజయధ్వానాలు.. డప్పుచప్పుళ్లు.. మంగళహారతుల మధ్య.. శివసత్తులు సిగాలూగంగ.. పిల్లల కోసం తల్లులు వరాలు పట్టంగ.. కన్నెపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ తరలివచ్చింది. తన రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్న లక్షలాది మంది భక్తుల సాక్షిగా బుధవారం రాత్రి 12.28 గంటలకు మేడారం గద్దెపై వరాల తల్లి కొలువుదీరింది. అంతకుముందు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును సైతం పూజరులు గద్దెలపైకి చేర్చారు. దీంతో నాలుగు రోజుల మేడారం మహాజాతర అధికారికంగా ప్రారంభమైంది. నేడు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుండగా.. ఇద్దరు తల్లులను దర్శించుకునేందుకు తరలివచ్చిన లక్షలాది భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది.
తల్లుల గద్దెలపై ముగ్గులు
సమ్మక్క సారక్క తల్లులను జాతరలోని గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చే క్రమంలో సారక్క పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ గుడివద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారక్క ఇంటి 13 కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలు కన్నెపల్లిలోని గుడిని శుద్ధి చేశారు. ముగ్గులు పెట్టి అలంకరించారు. మధ్యాహ్నం సమ్మక్క, సారక్క పూజారులు, ఆడబిడ్డలు.. ఆలయ శుద్ధితో పాటు ప్రధాన గద్దెల అలంకరణ విషయమై ఆచారం ప్రకారం ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ నివాసానికి వెళ్లి చర్చించారు. అనంతరం సమ్మక్క ఐదో, సారక్క మూడో గొట్టు గోత్రానికి చెందిన పూజరులు, ఆడబిడ్డల బృందం కన్నెపల్లి నుంచి డప్పుచప్పుళ్ల మధ్య మేడారంలోని ప్రధాన గద్దెల వద్దకు చేరుకున్నారు. పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. పీటముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించారు.
ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మ తల్లిని ప్రధాన పూజరి కాక సారయ్య ఆధ్వర్యంలోని బృందం కన్నెపల్లి గుడి నుంచి రాత్రి 7:38 గంటలకు అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలతో కూడిన వెదురుబుట్ట (మొంటె) తీసుకుని మేడారానికి బయలుదేరారు. కన్నెపల్లిలో సోలం వంశ పూజారులు హనుమాన్పూజలు నిర్వహించి జెండాతో ముందు నడవగా శోభాయాత్ర మొదలైంది. మధ్యలో సారక్క తమ్ముడు జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పొర్లుదండాలు, పిల్లల కోసం వరం పట్టిన ఆడబిడ్డల పైనుంచి పూజరుల బృందం నడుచుకుంటూ ముందుకుసాగింది. అవివాహితులు, ఏండ్ల తరబడి అనారోగ్యంతో బాధపడేవారు తడిబట్టలతో వరం పట్టారు.
ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన శోభాయాత్రలో మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క ఆదివాసీ మహిళలతో కలిసి డప్పువాయిద్యాల మధ్య సంప్రదాయ నృత్యం చేశారు. కాగా, సారక్క తల్లిని తీసుకొచ్చే క్రమంలో లక్షలాదిమంది జనం తల్లి ఆశీర్వాదం కోసం ఎగబడే అవకాశం ఉండడంతో పోలీసులు పూజరుల బృందం చుట్టూ స్పెషల్‌పార్టీ పోలీసుల టీంతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. పూజరుల చుట్టూ మొదటి వరుసలో ఆదివాసీ తుడుందెబ్బ యువత, ఆపై పోలీసులు మూడు వరుసల్లో నిలిచారు.
గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు
జాతరలో మొదటిరోజైన బుధవారం సారక్క తల్లితో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి వంశ పూజారులు ప్రధాన గద్దెలపై ప్రతిష్టించారు. మహబూబాబాద్జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే మేడారానికి పగిడిద్దరాజుతో కలిసి పూజారులు కాలినడక ద్వారా మంగళవారమే బయలుదేరారు. ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజుతో పూజారులు బుధవారం ఉదయం పూజల అనంతరం 12 కిలోమీటర్లు తరలొచ్చారు. సాయంత్రం సారక్కతో కలిసి సంప్రదాయ పూజలు చేశాక..సారక్కతల్లి గద్దె చేరడానికి ముందే పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ప్రధాన గద్దెలపై ప్రతిష్టించారు.
రాత్రికి రాత్రే జన జాతర..
మేడారం అసలుసిసలు నాలుగు రోజుల జాతర బుధవారం నుంచి మొదలయ్యే క్రమంలో భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు పోటెత్తారు. మంగళవారం మధ్యాహ్నం సమయానికి కొంత పలచగా కనిపించిన జాతర ప్రాంతాలు.. సాయంత్రం నుంచి భక్తులతో కిటకిలాడాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేట్
వెహికల్స్మొత్తం మేడారం వైపే పరుగులు పెట్టడంతో రాత్రికిరాత్రే జాతర చుట్టూరా నాలుగైదు కిలోమీటర్ల దూరం జనంతో నిండిపోయింది. బుధవారం ఉదయంకల్లా జంపన్నవాగు బ్రిడ్జి నుంచి ఎటువైపు చూసినా.. భక్తులు ఇసుక రేణువుల్లా కనిపించారు. జాతరలోని గద్దెల ప్రాంతం నుంచి ప్రస్తుతం జంపన్నవాగు, ఆర్టీసీ జంక్షన్, చిలకలగుట్ట వైపు నాలుగు లేన్ల రోడ్లు అభివృద్ధి చేయగా, భక్తుల రాకతో అవన్నీ నిండిపోయాయి. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 40 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు (జనవరి 29) సమ్మక్క రాక..
మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే సమ్మక్కతల్లిని గద్దెలపైకి తీసుకువచ్చే తంతు గురువారం జరగనుంది. సమ్మక్కతల్లి 5వ గొట్టుగోత్రాల పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తెచ్చి, జాతరలో గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఉదయం కంకవనం గద్దెల వద్దకు తెచ్చాక మేడారం చిన్న సమ్మక్క గుడి నుంచి పూజరులు కొత్త కుండలు తీసుకువస్తారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని తీసుకువచ్చేందుకు కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో వడ్డెరల బృందం మధ్యాహ్నం చిలుకలగుట్టకు వెళ్లడంతో అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే మేడారం జాతర..అందులోనూ చిలుకలగుట్ట తొవ్వలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది.
దాదాపు కిలోమీటర్ దూరం ఉండే మార్గంలో భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. గుట్టపై రహస్య ప్రాంతం నుంచి ప్రత్యేక పూజల అనంతరం పూజరులు గద్దెల ప్రాంతానికి బయలుదేరుతారు. అమ్మరాకకు సూచనగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతారు. తల్లిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తోసుకొని వచ్చే ప్రమాదం ఉండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సాయంత్రం 6 గంటల సమయంలో బయలుదేరే సమ్మక్కతల్లి గద్దెలకు చేరడానికి దాదాపు అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది.
సారక్క రాక ఇలా..
నాలుగు రోజుల మేడారం మహా జాతరలో సారక్క ఆగమనాన్ని తొలి ప్రధాన ఘట్టంగా చెప్తారు. వడ్డెలు(పూజరులు) బుధవారం రాత్రి 7:38 గంటలకు కన్నెపల్లి గుడి నుంచి సారక్కను సంప్రదాయబద్ధంగా తీసుకుని బయలుదేరారు. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం నుంచి గద్దెల ప్రాంతానికి వచ్చే క్రమంలో.. మేడారం గ్రామంలోని సమ్మక్క చిన్న ఆలయానికి రాత్రి 9:25 గంటలకు చేరుకున్నారు. అక్కడ పూజాకార్యక్రమాల అనంతరం లక్షలాది మంది భక్తుల నీరాజనాల మధ్య రాత్రి 12:30 గంటలకు సారలమ్మను ప్రధాన గద్దెపై ప్రతిష్టించారు. అమ్మవారు కొలువుదీరిన తర్వాత మొదట దేవాదాయశాఖ తరఫున మొదటి మొక్కులు చెల్లించారు. ఆపై వరాల తల్లిని దర్శించుకోడానికి భక్తులు అర్ధరాత్రి నుంచే పోటెత్తారు.
