- ఎన్‌ఐసీ సేవల్లో అంతరాయంతో రాష్ట్రంపైనా ఎఫెక్ట్
- ఆగిన లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సుల జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో సోమవారం ‘సారథి’ సేవలు నిలిచిపోయాయి. రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో పోర్టల్ స్తంభించడంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీ, లెర్నింగ్ లైసెన్సుల స్లాట్ బుకింగ్, లైసెన్సుల పునరుద్ధరణ పనులు ఆగిపోయాయి. ఇతరత్రా ఇబ్బందులు తలెత్తాయి. ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ఉదయం నుంచి సాయంత్రందాకా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో జనం పడిగాపులు కాశారు.
ఆదివారం మరుసటి రోజే ఈ సమస్య ఏర్పడడంతో జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ ఆఫీసులు వందలాది మందితో కిక్కిరిసిపోయాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(నిక్)లో ఏర్పడ్డ సాంకేతిక లోపంతోనే ఈ సమస్య ఏర్పడిందని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం నుంచి సేవలు పునరుద్ధరిస్తామని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెప్పారు.
