టెంపరరీ కండక్టర్లపై సర్కార్‌‌ నిఘా

టెంపరరీ కండక్టర్లపై సర్కార్‌‌ నిఘా

ఆర్టీసీ బస్సుల్లో అబ్జర్వర్లుగా వీఆర్వోలు, పంచాయతీ సెక్రటరీలు
ప్రయాణికుల సంఖ్య, వసూలవుతున్న చార్జీల లెక్కింపు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ బస్సులను నడిపేందుకు తాత్కాలికంగా నియమించిన కండక్టర్లను సర్కార్‌‌ నమ్మడం లేదు. వారు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారని, వసూలైన డబ్బులను డిపో మేనేజర్లకు సరిగ్గా ఇవ్వడం లేదనే ఆరోపణలు రావడంతో వారిపై నిఘా పెంచింది. ఈ క్రమంలోనే ప్రతి బస్సులో ప్రయాణికుల సంఖ్యను, వసూలు చేస్తున్న చార్జీలను లెక్కకట్టేందుకు బస్సుకో వీఆర్వో లేదా పంచాయతీ సెక్రటరీని అబ్జర్వర్లుగా అధికారులు నియమిస్తున్నారు. బస్సులో ఎక్కేవారు, దిగేవారి సంఖ్య, కండక్టర్‌‌ వసూలు చేస్తున్న చార్జీలను వారు గమనించి నోట్‌‌బుక్‌‌లో సైలెంట్‌‌గా లెక్కలు రాసుకుంటున్నారు. నిర్ణీత చార్జీలే వసూలు చేస్తున్నారా? అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా అనే విషయాలను గమనిస్తున్నారు.ఈ లెక్కను ట్రిప్పులవారీగా డిపో మేనేజర్లకు వాట్సప్‌‌ చేస్తున్నారు. ఆ వివరాలతో తాత్కాలిక కండక్టర్‌‌ ఇచ్చే డబ్బుల లెక్కను డీఎంలు క్రాస్‌‌ చెక్​ చేసుకుంటున్నారు.

పనులు అప్పగించడం సరికాదు

రెవెన్యూ శాఖకు చెందిన వీఆర్వోలకు ప్రభుత్వం బలవంతంగా ఆర్టీసీ బస్సుల్లో డ్యూటీ వేయడం సరికాదు. అవినీతిపరులని సీఎం కేసీఆర్‌‌ ముద్ర వేసిన వీఆర్వోలు.. ఇప్పుడు టెంపరరీ కండక్టర్ల అవకతవకలను ఎలా అరికడతారో చెప్పాలి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమ్మెకు తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం మద్దతిస్తోంది. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వీఆర్వోలు ఆర్టీసీ డ్యూటీలకు దూరంగా ఉండాలి. అధికారులు కూడా డ్యూటీలు వేస్తూ ఒత్తిడి చేయడం మానుకోవాలి.

– గరికె ఉపేందర్‌‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం