వేలం పాడింది ఒకరు.. ఏకగ్రీవమైంది మరొకరు..నామినేషన్‌ వేయకపోవడంతో చేజారిన పదవి

వేలం పాడింది ఒకరు.. ఏకగ్రీవమైంది మరొకరు..నామినేషన్‌ వేయకపోవడంతో చేజారిన పదవి
  • గద్వాల జిల్లా ఈడుగోనిపల్లిలో సర్పంచ్‌ను ఎన్నుకుంటూ గ్రామస్తుల తీర్మానం
  • మరో మహిళ ఒక్కతే నామినేషన్‌, ఏకగ్రీవంగా ఎన్నిక

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్‌ పదవి కోసం వేలం నిర్వహించారు. ఓ మహిళ సర్పంచ్‌ పదవిని దక్కించుకుంది. కానీ అదే గ్రామానికి చెందిన మరో మహిళ నామినేషన్‌ వేయగా.. వేలంలో పదవి దక్కించుకున్న మహిళ నామినేషన్‌ అందజేయలేదు. దీంతో వేలంలో పాల్గొనని మహిళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. గద్వాల జిల్లా ఈడుగోనిపల్లి గ్రామంలో గుడి అభివృద్ధి, రోడ్డు నిర్మాణం కోసం నిధులు ఇచ్చే వారినే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సరస్వతి అనే మహిళ గ్రామాభివృద్ధి కోసం రూ. 9.80 లక్షలు చెల్లించేందుకు ముందుకు రావడంతో పాటు అడ్వాన్స్‌గా రూ. లక్ష చెల్లించింది. 

దీంతో సరస్వతినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని గ్రామస్తులు తీర్మానించారు. కానీ ఆమె నామినేషన్‌ వేయకుండా ఆలస్యం చేయడంతో అదే గ్రామానికి చెందిన రాణి అనే మహిళ సర్పంచ్‌ పదవికి నామినేషన్ వేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. సరస్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని కోరినా రాణి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే సరస్వతి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అప్పటికే సమయం ముగిసిందని ఆఫీసర్లు చెప్పారు. 

ఈడుగోనిపల్లి సర్పంచ్‌ పదవికి రాణి నామినేషన్‌ ఒక్కటే రావడంతో సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. కాగా, శుక్రవారం గ్రామంలో మీటింగ్‌ నిర్వహించి.. అభివృద్ధికి నిధులు ఇవ్వాలని రాణిని అడిగారు. కానీ తాను అభివృద్ధి పనులు చేస్తానని, డబ్బులు ఇవ్వబోనని స్పష్టం చేయడంతో ఏం చేయాలో తెలియక గ్రామస్తులు ఆందోళనలో పడిపోయారు.