- సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్..
- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్
- పోలింగ్ రోజే కౌంటింగ్, ఫలితాల వెల్లడి
- తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్
- ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్, కాల్ సెంటర్
- ఈసారి బ్యాలెట్ పేపర్‌పై నోటా గుర్తు కూడా ఉంటుందని ఎస్‌ఈసీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు:
పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. సర్పంచ్, వార్డు మెంబర్ ఎలక్షన్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 25) విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 564 మండలాల్లోని 12,728 సర్పంచ్ స్థానాలకు.. 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. ఒక్కో విడత నోటిఫికేషన్ మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండేలా ప్రణాళిక రూపొందించింది.
మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ 27న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ డిసెంబర్11న జరగనుండగా.. సెకండ్ ఫేజ్ డిసెంబర్ 14న, థర్డ్ ఫేజ్ డిసెంబర్ 17న పోలింగ్‌జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో నోటా గుర్తు ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల కోసం మొత్తం 15,222 పోలింగ్ స్టేషన్లు కేటాయించినట్టు వెల్లడించారు. వార్డు స్థానాలకు వేరుగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఫస్ట్‌ఫేజ్‌లో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. ఇక సెకండ్ ఫేజ్‌లో 193 మండలాల్లోని 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికి డిసెంబర్ 14న పోలింగ్ ఉంటుంది. ఇక థర్డ్ ఫేజ్‌లో 182 మండలాల్లోని 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. వీటికి డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఫేజ్‌లోనూ పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు ఓట్ల కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించారు. అలాగే రిజల్ట్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు.
ఆ గ్రామాల్లో ఎన్నికల్లేవ్..
ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించామని రాణి కుముదిని తెలిపారు. వాళ్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై తమకు నివేదికలు అందిస్తారని చెప్పారు. ‘‘గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై గతంలో కోర్టు స్టే విధించింది. దీంతో ఇప్పుడు మళ్లీ రీషెడ్యూల్ ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీలు, వార్డుల సంఖ్య, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల వివరాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. ప్రజలు వాటిని పరిశీలించుకోవచ్చు. కోర్టు తీర్పు మేరకు 32 గ్రామ పంచాయతీలు, 292 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు” అని వెల్లడించారు.
ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్..
ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి వీలుగా గ్రీవెన్స్ సెల్, కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు రాణి కుముదిని తెలిపారు. ‘‘రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో గ్రీవెన్స్ సెల్ మాడ్యూల్ ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చు. ఈ ఫిర్యాదుల నమోదుకు సంబంధించిన యాప్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. అలాగే కంప్లయింట్ల కోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు తెలుగు, ఇంగ్లిష్‌లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి” అని చెప్పారు. ఈ సమావేశంలో లాఅండ్ఆర్డర్అడిషనల్డీజీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ సెక్రటరీ మకరంద్, పంచాయతీరాజ్‌శాఖ డైరెక్టర్ శ్రీజన పాల్గొన్నారు.
ఫేజ్ నామినేషన్లు పోలింగ్ / కౌంటింగ్ మండలాలు సర్పంచ్ స్థానాలు వార్డు స్థానాలు
ఫస్ట్ ఫేజ్ నవంబర్ 27-29 డిసెంబర్ 11 189 4,236 37,440
సెకండ్ ఫేజ్ నవంబర్ 30- డిసెంబర్ 2 డిసెంబర్ 14 193 4,333 38,350
థర్డ్ ఫేజ్ డిసెంబర్ 3-6 డిసెంబర్ 17 182 4,159 36,452
మొత్తం – – 564 12,728 1,12,242
