ఓటేయలేదన్న కోపంతో మహిళపై సర్పంచ్ కుటుంబం దాడి.. నిజామాబాద్ జిల్లాలో ఘటన

 ఓటేయలేదన్న కోపంతో మహిళపై సర్పంచ్ కుటుంబం దాడి.. నిజామాబాద్ జిల్లాలో ఘటన

నవీపేట్, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కారణంతో సర్పంచ్ కుటుంబ సభ్యులు దాడి చేశారంటూ  నవీపేట్ మండలం అబ్బపూర్(ఎం) గ్రామానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నీరడి అరుణ భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్‌‌లో ఉండగా, ఆమె అత్తమామలు, పిల్లలతో కలిసి ఉంటోంది.

గత డిసెంబర్‌‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ శ్రీనివాస్‌‌కు ఓటు వేయలేదనే కారణంతో ఆయన కుటుంబ సభ్యులు తరచూ గొడవకు దిగుతున్నారని ఆరోపించింది. సోమవారం అరుణ కొడుకును సర్పంచ్ కుటుంబ సభ్యులు దుర్భాషలాడుతుండగా ఆమె ప్రశ్నించడంతో, సర్పంచ్ తల్లి సాయమ్మ, భార్య లావణ్యతో పాటు కిషన్, సాయమ్మ కలిసి దాడి చేశారని తెలిపింది.

ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంగళవారం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపారు.