అమెరికాకు కోలుకోలేని దెబ్బ!.. ఇరాన్ తో యుద్దంలో భారీ ఆస్తి, ప్రాణనష్టం

అమెరికాకు కోలుకోలేని దెబ్బ!.. ఇరాన్ తో యుద్దంలో భారీ ఆస్తి, ప్రాణనష్టం
  • ఇప్పటివరకు ఇరాన్​తో జరిగిన యుద్ధంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం  
  • 15 అమెరికా బేస్‌‌‌‌లపై దాడి, 228 కీలక కట్టడాలు ధ్వంసం
  • శాటిలైట్ ఇమేజ్ లను రిలీజ్ చేసిన ఇరాన్... ధ్రువీకరించిన అగ్రరాజ్యం
  • పేట్రియాట్, థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా విధ్వంసం 

అమెరికాను ఇరాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా, ఇప్పటివరకు అమెరికాకు చెందిన 15 బేస్​లపై ఇరాన్ డ్రోన్, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో కనీసం 228 కీలక కట్టడాలు, యుద్ధ పరికరాలు ధ్వంసమైనట్లు తాజాగా శాటిలైట్​ఇమేజ్​లను ఇరాన్​ రిలీజ్ ​చేసింది.

వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఆధిపత్యానికి ఇరాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా, ఇప్పటివరకు అమెరికాకు చెందిన 15 బేస్​లపై ఇరాన్ డ్రోన్, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో కనీసం 228 కీలక కట్టడాలు, యుద్ధ పరికరాలు ధ్వంసమైనట్లు తాజాగా శాటిలైట్​ఇమేజ్​లను ఇరాన్ ​రిలీజ్​ చేసింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన నష్టం కంటే ఇది చాలా రెట్లు అధికమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

 ఇరాన్ ప్రభుత్వ మీడియా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన హై-రిజల్యూషన్ చిత్రాలను తొలుత అమెరికా కొట్టిపారేసినప్పటికీ, ‘వాషింగ్టన్ పోస్ట్’ జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యూరోపియన్ యూనియన్ శాటిలైట్ డేటాతో పోల్చి చూసిన ఈ దర్యాప్తు సంస్థ, ఇరాన్ విడుదల చేసిన 109 చిత్రాలు వాస్తవమని ధ్రువీకరించింది. హ్యాంగర్లు, బ్యారక్‌‌‌‌లు, ఇంధన డిపోలు, కీలకమైన రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. 

ఇరాన్ దాడుల్లో ఖతార్‌‌‌‌లోని అల్-ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం ధ్వంసమైంది. బహ్రెయిన్​లో యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ కార్యాలయంలోని శాటిలైట్ డిష్, రాడోమ్‌‌‌‌లు దెబ్బతిన్నాయి. కువైట్‌‌‌‌లోని క్యాంప్ బ్యూరింగ్‌‌‌‌లోని విద్యుత్ కేంద్రం, పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలో ఈ-3 సెంటినల్ విమానం, ఇంధన ట్యాంకర్లపై దాడి జరిగింది. జోర్డాన్, యూఏఈలో మోహరించిన అత్యాధునిక ‘థాడ్’ క్షిపణి రక్షణ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. 

ప్రాణనష్టంపై అధికారిక లెక్కలు..

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియా అంతటా ఇరాన్ దాడుల్లో కనీసం ఏడుగురు అమెరికా సైనికులు మరణించారు.  మరో 400 మందికి పైగా సైనికులు గాయపడ్డారు.
సమాచార నియంత్రణకు అమెరికా యత్నం..యుద్ధంలో జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలియకుండా చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అభ్యర్థన మేరకు ‘వాంటోర్’, ‘ప్లానెట్ ల్యాబ్స్’ వంటి ప్రధాన ఉపగ్రహ సంస్థలు మధ్యప్రాచ్య చిత్రాలను విడుదల చేయకుండా నియంత్రించాయి. 

అయితే ఇరాన్ తన స్వంత ఉపగ్రహ వ్యవస్థల ద్వారా ఈ విధ్వంస దృశ్యాలను బయటపెట్టి అమెరికా రక్షణ వైఫల్యాలను ఎండగట్టింది. కాగా, ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని అమెరికా తక్కువగా అంచనా వేసిందని రిటైర్డ్ మెరైన్ కార్ప్స్ కల్నల్ మార్క్ కాన్సియన్ అభిప్రాయపడ్డారు.