కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో రెండోసీడ్ సాత్విక్–చిరాగ్ 21–9, 18–21, 17–21తో వరల్డ్ నంబర్‌వన్ జోడీ లియాంగ్ వీ కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడింది.
58 నిమిషాల మ్యాచ్‌లో ఇరుజట్లు అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాయి. స్టార్టింగ్‌లో బేస్ లైన్ గేమ్‌తో చెలరేగిన సాత్విక్–చిరాగ్ ఈజీగా తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే రెండో గేమ్‌లో చైనీస్ ప్రత్యర్థులు షార్ట్ ర్యాలీస్‌తో పాటు నెట్ వద్ద డ్రాప్ వేస్తూ ఇండియన్ జోడీని కట్టడి చేశారు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సాత్విక్ క్రాస్ కోర్టు విన్నర్స్‌తో రెచ్చిపోయాడు. దీంతో 11–7 లీడ్‌లో నిలిచారు. కానీ చివర్లో సాత్విక్ ఫ్లాట్ పుష్ చేయడానికి ప్రయత్నించి వరుసగా పాయింట్లుకోల్పోయాడు. దీంతో చైనీస్ జోడీ 14–13 లీడ్‌లోకి వచ్చింది. అదే జోరుతో ర్యాలీస్‌ను ఆడిన లియాంగ్ వరుస పాయింట్లతో లీడ్‌ను 19–16కు పెంచాడు. ఈ దశలో సాత్విక్ ద్వయం ఒక్క పాయింట్ గెలిచినా.. లియాంగ్ రెండు క్రాస్ కోర్టు డ్రాప్స్ వేసి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
