డోర్నకల్ లో సత్యవతి వర్సెస్ రెడ్యానాయక్

డోర్నకల్ లో సత్యవతి వర్సెస్ రెడ్యానాయక్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్ ​నియోజకవర్గం(ఎస్టీ)లో వర్గపోరు ముదురుతోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​, సిట్టింగ్​ ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్​మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ క్యాండిడేట్‌‌‌‌గా ఎవరు బరిలోకి దిగుతారనేది హాట్​టాపిక్‌‌‌‌గా మారింది.  రెండు రోజుల కింద హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో హైకమాండ్​ఆదేశిస్తే  తాను బరిలోకి దిగుతానని మంత్రి సత్యవతి కామెంట్స్​ ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు తాను ఎప్పుడు చనిపోతానని  కొంతమంది ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యానాయక్​ కామెంట్స్​సంచలనంగా మారాయి. 

ఒకే పార్టీలో ఉన్నా.. 

గతంలో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే రెడ్యానాయక్.. ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్నారు. ఒకే పార్టీలో ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు.  అధికారిక కార్యక్రమాలు మినహా, పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొనడం లేదు. ఇద్దరూ డోర్నకల్ ​సీటు ఆశిస్తుండడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రెడ్యానాయక్​ ఇక్కడి నుంచి 6 సార్లు గెలిచారు. కాంగ్రెస్​ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ఈ సారీ కూడా తనకే అవకాశం ఇవ్వాలని ఇటీవల కురవి, చిన్నగూడూరు మండలాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో కోరారు. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన సత్యవతి రాథోడ్.. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

కేడర్‌‌‌‌‌‌‌‌లో అయోమయం 

ఇద్దరు లీడర్ల ప్రకటనలతో కేడర్‌‌‌‌‌‌‌‌లో అయోమయం నెలకొంది. కొంతమంది తొలినుంచి మంత్రి సత్యవతి రాథోడ్​ వెంట ఉండగా.. మరికొంతమంది ఎమ్మెల్యే డీఎస్​ రెడ్యానాయక్​ వెంట ఉన్నారు.  ఒకేపార్టీలో ఉన్నా ఎవరి గ్రూపు వారు మెయింటెన్​చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కేడర్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్యే రెడ్యానాయక్​ నుంచి పిలుపు అందడం లేదు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు జరగగా కేవలం మరిపెడ మీటింగ్‌‌‌‌లోనే మంత్రి పాల్గొన్నారు. మిగిలిన చోట్ల ఆమె లేకుండానే మీటింగ్‌‌‌‌లు జరుగుతున్నాయి. ఇటీవల మహబూబాబాద్​ వ్యవసాయ మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారంలోనూ మంత్రి సత్యవతికి ఆహ్వానం లేకపోవడం గమనార్హం. ఫ్లెక్సీల్లోనూ మంత్రి ఫొటోలు లేవు.  దీంతో కేడర్​ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక సతమవుతోంది. ఈ వర్గపోరుపై హైకమాండ్​ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. 

డోర్నకల్ సీటు నాదే.. - ఎమ్మెల్యే రెడ్యా నాయక్

మరిపెడ(చిన్న గూడూరు),వెలుగు: డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని.. గెలిచేది కూడా తానేనని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మహబూబాబాద్​జిల్లా చిన్న గూడూరులో నిర్వహించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డోర్నకల్ ప్రజలు తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని,ఈ ఒక్కసారే తాను నిలబడతానని, ఈసారి కూడా గెలిపించాలని కోరారు. టీపీసీసీ చీఫ్​రేవంత్‌‌‌‌రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బెదిరించడం, బ్లాక్‌‌‌‌మెయిల్​చేయడం తప్ప ఇంకేమీ చేయడన్నారు. రాహుల్ గాంధీని ఎంపీ పదవి నుంచి సస్పెండ్​చేస్తే పీసీసీ అధ్యక్షుడిగా కనీసం నిరసన కార్యాచరణ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెసోళ్లే దించాలని చూస్తున్నారంటూ హాట్​కామెంట్స్​చేశారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జడ్పీటీసీ సునీత, ఎంపీపీ పద్మ, లీడర్లు రవిచంద్ర, రామ్ సింగ్, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.