- ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం..
- ఒక కుటుంబంలో ఆరుగురు, మరో ఫ్యామిలీలో నలుగురు దుర్మరణం
- కుటుంబంలో ఐదుగురిని కోల్పోయి ఒంటరైన వృద్ధుడు
బతికిన ఒకే ఒక్కడు.. టప్పాచబుత్రాలోని నటరాజన్ నగర్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్ (68) ఫర్నీచర్ వ్యాపారి. ఆయన తన భార్య గౌసియా బేగం (50), కొడుకు అబ్దుల్ షోయబ్ మహమ్మద్‌తో పాటు మామ మహమ్మద్ మౌలానా (60)తో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు.
అక్కడ జరిగిన ప్రమాదంలో షోయబ్ ఒక్కడు బతికి బయటపడగా, మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అలాగే అబ్దుల్ ఖాదిర్ పక్కింట్లోనే ఉండే ఆయన సోదరుడు మహమ్మద్ అలీ (55) హోటల్ వ్యాపారం చేస్తుంటాడు. అతడు కూడా తన భార్య షహనాజ్ బేగం (40)తో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లాడు. ప్రమాదంలో వీళ్లిద్దరూ కూడా చనిపోయారు.
ముషీరాబాద్, వెలుగు: సౌదీలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి 18 మంది మృతి చెందారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ షేక్(70), ఆయన భార్య అక్తర్ బేగం (62).. నసీరుద్దీన్ చిన్న కొడుకు సలావుద్దీన్ (42), చిన్న కోడలు ఫరానా సుల్తానా ( 37)తో పాటు వీళ్ల కొడుకు షేక్ జైనుద్దీన్ (12), కూతుళ్లు రిడా తజీన్ (10), తస్మియా తహ్రీన్ (3).. నసీరుద్దీన్ పెద్ద కోడలు సనా బేగం (35)తో పాటు ఆమె కూతుళ్లు మిహ్రీష్ (10), ఒమేజా ఫాతిమా (5), కొడుకు ఉజైరుద్దీన్ (3)... నసీరుద్దీన్ కూతుళ్లు షబానా బేగం (40), అమీనా బేగం (40), రిజ్వానా బేగం (38).. అమీనా బేగం కూతురు అనీష్ ఫాతిమా (25), షబానా బేగం కొడుకు హుజైఫా జాఫర్ (3), రిజ్వానా బేగం కూతురు మరియం ఫాతిమా (6), ఆమె కొడుకు ఎండీ షాజైన్ (2).. కలిపి మొత్తం 18 మంది యాత్రకు వెళ్లారు. వీళ్లందరూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ పెద్ద కొడుకు సిరాజుద్దీన్, ముగ్గురు అల్లుళ్లు, మరో ఇద్దరు మనుమలు యాత్రకు వెళ్లలేదు.
అనాథలైన ఇద్దరు కొడుకులు..
కిషన్ నగర్‌లోని జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ మంజూర్(45) ఫర్నీచర్ వ్యాపారి. ఆయన తన భార్య ఫరీదా బేగం (35), డిగ్రీ చదువుతున్న కూతురు జహీనా బేగం, తల్లి షౌకత్ బేగం (59)తో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో అందరూ చనిపోయారు. యాత్రకు వెళ్లకుండా మంజూర్ఇద్దరు కొడుకులు ఇంటి దగ్గరే ఉన్నారు. కుటుంబంలో అందరూ చనిపోవడంతో వాళ్లు అనాథలయ్యారు.
ఓల్డ్‌సిటీ వెలుగు: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. పాతబస్తీ ఫాతిమానగర్‌లోని ఫారూఖ్‌నగర్‌కు చెందిన ముస్తాన్ అహ్మద్ (55) లారీ మెకానిక్. ఈయనకు భార్య జకియా బేగం (47), నలుగురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్యతో పాటు కొడుకు సొహైల్ అహ్మద్ (23)ను తీసుకుని ఉమ్రా యాత్రకు వెళ్లగా.. ముగ్గురూ చనిపోయారు.
తల్లీకొడుకు..
పాతబస్తీలోని షంషీర్ గంజ్ చందూలాల్ బారాదరిలో ఉండే సలీం ఖాన్ (42) చార్మినార్ దగ్గర చెప్పుల వ్యాపారం చేస్తుంటాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. సలీంఖాన్ తన తల్లి సారా బేగం(60)తో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లగా ఇద్దరూ చనిపోయారు.
మరో ముగ్గురు మహిళలు..
గండిపేట/జూబ్లీహిల్స్: సౌదీ ప్రమాదంలో వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు చనిపోయారు. రాజేంద్రన గర్‌లోని సులేమాన్‌నగర్‌కు చెందిన పర్వీన్ బేగం(33), కూకట్‌పల్లిలోని అల్లాపూర్ డివిజన్‌కు చెందిన రహమతున్నీసా బేగం (60), ఈమెకు సమీప బంధువైన జహీరాబాద్‌కు చెందిన రహమత్ బీ (70) యాక్సిడెంట్‌లో చనిపోయారు.
భార్యాభర్త... తల్లీకొడుకు
మురాద్‌నగర్ ప్రాంతానికి చెందిన సారా మహమ్మద్ అలీ అమౌది (45) ఫర్నీచర్ వ్యాపారి. ఆయన తన భార్య షాహజహాన్ బేగం(39) తో కలిసి ఉమ్రాకు వెళ్లారు. ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. అలాగే టోలిచౌకీలోని మీరాజ్ కాలనీకి చెందిన మహమ్మద్ సోహెబ్ ఉర్ రెహ్మాన్ (37) వ్యాపారి. ఆయన తన తల్లి రహీజా బేగం(64)తో ఉమ్రాకు వెళ్లాడు. మూడు నెలల కిందనే రెహ్మాన్ సోదరుడు సైఫూర్ రెహ్మాన్ (33) సౌదీ వెళ్లాడు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సులో సోహెబ్ ఉర్ రెహ్మాన్, రహీజా బేగంతో పాటు సైఫూర్ కూడా ఎక్కాడు. ప్రమాదంలో ముగ్గురూ చనిపోయారు.
అందర్నీ కోల్పోయి ఒంటరైన పెద్దాయన..
లంగర్‌హౌస్‌లోని మొఘల్ నగర్‌కు చెందిన వృద్ధుడు సలీం అహ్మద్.. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటర య్యారు. ఈయన భార్య సబిహా సుల్తానా (54), కొడుకు ఇర్ఫాన్ అహ్మద్ (45), కోడలు హుమేరా నజ్నీన్ (34), మనమళ్లు ఇజాన్ అహ్మద్ (14), హమదాన్ అహ్మద్ (12) ఉమ్రా యాత్రకు వెళ్లగా.. ప్రమాదంలో అందరూ చనిపోయారు.
మెహిదీపట్నం, వెలుగు: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాంపల్లి, కార్వాన్నియోజకవర్గాలకు చెందిన 19 మంది చనిపోయారు. ఈ ప్రాంతాల నుంచి మొత్తం 20 మంది వెళ్లగా, ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. లంగర్‌హౌస్‌లోని మొఘల్ నగర్‌కు చెందిన ఐదుగురు, టప్పాచబుత్రాలోని నటరాజన్ నగర్‌కు చెందిన ఐదుగురు, టోలీచౌకీలోని మిరాజ్ కాలనీకి చెందిన ముగ్గురు, కిషన్ నగర్‌లోని జిర్రా ప్రాంతానికి చెందిన నలుగురు, మురాద్ నగర్‌కు చెందిన ఇద్దరు ప్రమాదంలో చనిపోయారు. బాధిత కుటుంబాలను మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, మాజీద్ హుస్సేన్ పరామర్శించారు.
