రెండు ముక్కలు కానున్న నల్లమల..?

రెండు ముక్కలు కానున్న నల్లమల..?

నల్లమల అడవుల్లోని నాగార్జున సాగర్-– శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెండు ముక్కలుగా విభజించినట్లు అయిపోనుందా? ఈ టైగర్ రిజర్వ్ నుంచి నేషనల్ హైవేను డైవర్ట్​ చేస్తూ నిర్మిస్తున్న రోడ్డు వల్ల పులులు, జంతువులు, పక్షుల మనుగడకే ముప్పు ఏర్పడనుందా? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ప్రతిపాదించిన ప్రాజెక్టు ఓకే అయితే.. అలాగే జరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఎన్ హెచ్ 40 విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో కర్నూల్ నుంచి నందికొట్కూర్, ఆత్మకూర్ ల మీదుగా దోర్నాల జంక్షన్ 5 వరకూ నేషనల్ హైవేను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్
డి. చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్ట్ లోనూ ఇవే విషయాలు తెలిశాయి.

పులులు, వన్యప్రాణులకు అడ్డంకి 

‘‘నాగార్జున సాగర్- – శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోని ఈ రూట్లో నేషనల్ హైవే నిర్మాణంతో రిజర్వ్ ను రెండు ముక్కలుగా విభజించినట్లు అవుతుంది. జంతువులకు నీడనిస్తున్న అడవులు ధ్వంసమవుతాయి. వన్యప్రాణులు అటూ ఇటూ తిరగడానికి హైవే అడ్డవుతుంది. వాటికి నీటి వనరులు కూడా కరువై చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది” అని ఈ రిపోర్టులో చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు టైగర్ రిజర్వ్ లో ఒక చోట 71 హెక్టార్లు, మరో చోట 32 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూల్, ప్రకాశం జిల్లాల పరిధిలో ఆత్మకూర్, మార్కాపురం డివిజన్లలో 39 ఎకరాల మేరకు ఎకో సెన్సిటివ్ జోన్ కిందకు వస్తుందని పేర్కొంటున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 221 కోట్ల రూపాయలు. అయితే వైల్డ్ లైఫ్ ​శాంక్చురీ ప్రాంతం యాభై హెక్టార్ల కన్నా తక్కువే ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్షులు, జంతువులకు ఎలాంటి దెబ్బ తగులుతుందో, చెట్లు, చేమలకు ఎలాంటి నష్టం జరుగుతుందో పూర్తి లెక్కలు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

నేషనల్ హైవేతో ట్రాఫిక్ పెరుగుతది

ప్రస్తుతం డోర్నాల రూట్లో రోజూ సగటున 4,748 ప్యాసెంజర్ కార్లు, 3,802 ఇతర ట్రాఫిక్ ఉంది. నేషనల్ హైవేను నిర్మిస్తే, ఈ రూట్లో 2046 నాటికి ట్రాఫిక్ 28,203కు, ప్యాసెంజర్ కార్లు 36,801కి పెరుగుతాయని అంచనా. ఇక్కడ ట్రాఫిక్ పెరగడంతో పాటు అనేక చోట్ల రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు జరుగుతాయని దీంతో వన్యప్రాణులకు ముప్పు తీవ్రంగా పెరుగుతుందని అంటున్నారు. టైగర్ రిజర్వ్ ఏరియాల్లో ట్రాఫిక్ కదలికలపై తప్పనిసరిగా
ఆంక్షలు విధించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. మరోవైపు తెలంగాణ పరిధిలోకి వచ్చే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోనూ ఈ నేషనల్ హైవేను విస్తరించాలన్న ప్రతిపాదన ఉంది. ఇక్కడ హైవే విస్తరణతో కనీసం 20 వేల చెట్లను నరికివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్

నాగార్జున సాగర్- – శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, మొసళ్లు, ఇండియన్ పైథాన్, తాబేళ్ల వంటి ఎన్నో జంతువులు ఇక్కడ ఉన్నాయి.