మహిళల విద్యా ప్రదాత సావిత్రి బాయి ఫూలే : జి. కిరణ్​కుమార్

మహిళల విద్యా ప్రదాత సావిత్రి బాయి ఫూలే : జి. కిరణ్​కుమార్

సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. ఆమె భారతదేశంలోని మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యనందించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మహారాష్ట్రలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నారు. అయితే భర్త జ్యోతిరావు ఫూలే సహకారంతో విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయురాలిగా మారారు. అణగారిన వర్గాల విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన సావిత్రి బాయి ఫూలే సమాజంలోని అట్టడుగు వర్గాలైన మహిళలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మహిళలు కట్టుబాట్లకు లోబడి బయటకు రాలేని రోజుల్లో సావిత్రి బాయి ఫూలే మహిళల సాధికారిత కోసం ఒక నిశ్శబ్ద విప్లవాన్ని నడిపారు. తన సోదరుల్ని కులతత్వ దృక్పథం నుంచి మేల్కొలిపి, ఆ తర్వాత తన ప్రయత్నాలను అట్టడుగు స్థాయి నుంచి ఆరంభించి, తల్లిదండ్రులు తమ కుమార్తెలను బడికి పంపేలా కోరారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో పాటు తాను స్థాపించిన మొదటి బాలికల పాఠశాలను బాలికలు విద్యకోసం రావల్సిన అవసరాన్ని తెలిపారు. అందువల్ల, సావిత్రి బాయి ఫూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందారు. అగ్రకులాలు ఆమెను తీవ్రంగా విమర్శించాయి. ఆమెపైన ఎన్నో భౌతిక, మానసిక దాడులు జరిగాయి. అయితే, ఇన్ని దాడులు జరుగుతున్నా, అణగారిన వర్గాలను విముక్తి కల్పించాలనే ఆమె లక్ష్యాన్ని అవి దెబ్బతీయలేకపోయాయి.

సంస్కరణ వాది..

సావిత్రి బాయి ఏర్పరుచుకున్న బోధనా పద్ధతి సమ్మిళిత స్వభావంగా, విద్యార్థిని భాగస్వామిని చేసేలా వినూత్నంగా ఉండేది. విద్య ద్వారా విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించడాన్ని ఆమె ప్రోత్సహించేది. 11 ఏండ్ల ముక్తా బాయ్ అనే సావిత్రి బాయ్ దళిత శిష్యురాలు మాంగ్‌లు, మహర్‌లు సమాజంలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలు – బాధలపై1855లో ధ్యానోదయ అనే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాసింది. వివిధ అంశాలపై దళిత మహిళలు రాసిన రచనల్లో బహుశా దీన్ని తొలిరచనల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. సావిత్రి బాయి సామాజిక మార్పును అట్టడుగు స్థాయి నుంచి తీసుకురావడానికి ప్రయత్నించారు. దీనికి అనుగుణంగా ఆమె ఆ కాలంలో అమల్లో ఉన్న సాంఘిక కట్టుబాట్లను, సంప్రదాయాలను నిశితంగా విమర్శించేవారు. శూద్రులకు ఆమె స్వయంగా బావులను ఏర్పరిచింది.  సంస్కరణవాది అయిన జ్యోతిరావ్ ఫూలేతో కలిసి కులవ్యవస్థపై సమూలంగా పోరాటం చేసింది. కులాంతర వివాహాలను ప్రోత్సహించి, ఆ విధంగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఆశ్రయం కల్పించేవారు. సావిత్రి బాయి సాహిత్య గ్రంథాల్లో కావ్య ఫూల్(కవిత్వ నవవికాసం), బావన్ కాషీ సుబోధ్ రత్నాకర్(రత్నాల సంద్రం) తదితర రచనలు ఆమెలోని సృజనాత్మక ఆలోచనలు, సామాజిక చింతనలను మేళవింపుగా ప్రతిబింబిస్తాయి. అణగారిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం, తద్వారా వారి విమోచనకు పాటుపడటం, ఆంగ్లవిద్య ప్రాముఖ్యాన్ని పేర్కొనడం, సంప్రదాయ దురాచారాలు, అహేతుక విలువలను సవాలు చేయడం, వితంతువులకు పునర్వివాహాలను, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, దళితులకు మంచినీటి బావులు అందుబాటులో ఉంచడం, మహిళలకు అనుకూలంగా ప్రజాజీవనంలోని వ్యక్తిగత- బహిరంగ సందర్భాల్లో తనగొంతు వినిపించడం, ఇతర మతాలకు చెందిన అల్పసంఖ్యాక వర్గాలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండటం సావిత్రిబాయి దృ క్పథం.

ఆమె చరిత్ర పాఠాలుగా పెట్టాలి..

సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫూలేకు సంబంధించిన చరిత్రను పాఠ్యాంశాలలో   అంతర్భాగం చేసి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలి. ఫూలే జీవితాలు, రచనలు, కార్యచరణ తదితర అంశాలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరపడానికి అధ్యయన కేంద్రాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. సావిత్ర బాయి రచనలు, ఆమె జరిపిన కృషి సమకాలీన సమాజానికి ఇప్పటికీ చాలా అనుగణమైనవే. 

- జి. కిరణ్​కుమార్, అధ్యక్షుడు, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్​అసోసియేషన్