విమలక్క తండ్రి మృతి

విమలక్క తండ్రి మృతి
  • తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు కన్నుమూత

యాదాద్రి, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు(103) కన్నుమూశారు. కొంతకాలంగా హైదరాబాద్​లో పెద్ద కొడుకు ఇంటి వద్ద ఉంటున్న  ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. యాదాద్రి జిల్లా ఆలేరులో బండ్రు కొమురమ్మ, బుచ్చిరాములు దంపతులకు1918లో జన్మించిన నర్సింహులు యువకుడిగా ఉన్నప్పుడే ఆరుట్ల రాంచంద్రారెడ్డి ప్రేరణతో నిజాం సైన్యంతో పోరాడారు. ఆలేరు ప్రాంతంలో శివారెడ్డి నాయకత్వంలో వంగపల్లిలో నిజాం పోలీసులను ఎదుర్కొని వారి తుపాకులతోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. గ్రామాల్లో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు నర్సింహులును అరెస్టు చేశారు. చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన సీపీఐ(ఎంఎల్)లో దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి నాయకత్వంలో ఆయన పనిచేశారు. సుదీర్ఘకాలంగా సీపీఐ(ఎంఎల్) జనశక్తిలోనే కొనసాగుతూ వచ్చారు. ఉద్యమ కాలంలో నర్సింహులు 22 ఏండ్ల జైలు జీవితం గడిపారు. ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నట్టు కటుంబీకులు తెలిపారు. ఆయన చూపిన ఉద్యమ మార్గంలోనే కొనసాగిన కూతురు విమలక్క జనశక్తిలోని అరుణోదయ కళామండలిలో పని చేస్తున్నారు. నర్సింహులుకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆయన చిన్న కోడలు బండ్రు శోభారాణి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు. నర్సింహులు మృతిపట్ల చుక్కా రామయ్య విచారం వ్యక్తం చేశారు. నర్సింహులు భౌతికకాయానికి నివాళులర్పించారు.