గత నెల జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ రాజ్ సబర్వాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ద్వారా విమాన ప్రమాదంపై రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా, సాంకేతికంగా సరైన దర్యాప్తు జరగాలని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ (AAIB దర్యాప్తు) సరిగా లేదని, స్వతంత్రంగా జరగలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో 260 మంది చనిపోయారు.
దీనికి సంబంధించి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ పైలట్ తండ్రికి ధైర్యం చెప్తూ, ఈ ప్రమాదం దురదృష్టకరం, కానీ మీ కొడుకును నిందించారనే భారాన్ని మీరు మోయొద్దు... ఎవరూ అతన్ని నిందించలేరు అని, ఇది పైలట్ తప్పిదం అని భారతదేశంలో ఎవరూ నమ్మరు అని అన్నారు.
ప్రాథమిక విచారణలో కూడా పైలట్ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని మరో న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి చెప్పారు. పైలట్ తప్పు అని విదేశీ మీడియాలో వచ్చిన వార్తలను కోర్టు ఖండిస్తూ.. దుర్మార్గం అని పేర్కొంది.
పైలట్ తండ్రి పిటిషన్ ద్వారా ప్రస్తుత విచారణను ఆపేయాలి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర విమానయాన నిపుణుల బృందంతో దర్యాప్తు చేయించాలి అని డిమాండ్ చేసారు. ప్రాథమిక రిపోర్టులో సాంకేతిక సమస్యలను పట్టించుకోకుండా పైలట్‌ను నిందించేలా సూచనలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో కేంద్రానికి, డీజీసీఏకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ నవంబర్ 10 న జరగనుంది.
