ఎస్సీ గురుకుల స్కూళ్ల టైమింగ్స్‌ మారుస్తం : సెక్రటరీ కృష్ణ ఆదిత్య

ఎస్సీ గురుకుల స్కూళ్ల టైమింగ్స్‌ మారుస్తం : సెక్రటరీ కృష్ణ ఆదిత్య
  • టీచర్ సంఘాలకు సెక్రటరీ కృష్ణ ఆదిత్య హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ఉన్న స్కూళ్లలో టైమింగ్స్ మారుస్తామని గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారు. గురువారం మసాబ్ ట్యాంక్‌లోని సోసైటీ హెడ్ ఆఫీసులో టీచర్ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

టైమింగ్స్ మార్చడంతో నైట్ డ్యూటీ చేసిన వాళ్లు మరుసటి రోజు డ్యూటీ విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి టీచర్లు ప్రాధాన్యత ఇవ్వాలని, టీచర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. త్వరలో 30 మంది ప్రిన్సిపాల్స్‌కు ప్రమోషన్లు ఇస్తున్నామని సెక్రటరీ వెల్లడించారు. 

పార్ట్ టైం టీచర్ల వేతనాలు రెండ్రోజుల్లో విడుదల చేస్తామని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు 010 వేతనాల అమలు కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిస్తామని హామీ ఇచ్చారు. కేర్‌ టేకర్‌గా అదనపు పోస్టులు మంజూరుకు, ప్రిన్సిపాల్ ప్రమోషన్‌లో సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ 100 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ విభాగం నేతలు ఎల్లయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.