
- ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి
హైదరాబాద్, వెలుగు : ఎస్సీ గురుకుల టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను రూల్స్‌కు అనుగుణంగానే చేపట్టామని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి స్పష్టం చేశారు. ఖాళీలు గుర్తించి, ఆప్షన్లు తీసుకొని, ఓపెన్ కౌన్సెలింగ్ చేపట్టి ఈ ప్రక్రియ పూర్తి చేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ నెల 21న ఎస్సీ గురుకులాల్లోని టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలో రూల్స్ ఉల్లంఘించారని సెక్రటరీ ఆఫీస్ ముందు కొంత మంది ఆందోళన చేపట్టారు. దీంతో వారికి సెక్రటరీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు ఒక టీచర్‌ను సస్పెండ్ చేశారు.
అధికారులు, సిబ్బందితో కూడిన కమిటీతో, అన్ని కేడర్ల ఉద్యోగుల సమ్మతితో పారదర్శకంగా పూర్తి చేశామని, ప్రతి దశలోనూ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామని చెప్పారు. బదిలీల ప్రక్రియను గత నెల 9, 10 తేదీల్లో బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో చేపట్టామన్నారు. సినీయారిటీ లిస్ట్ ప్రకటన, బదిలీ అయిన వారి వివరాలు తదితర అంశాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని సెక్రటరీ వెల్లడించారు. 8 ఏండ్ల నుంచి డిగ్రీ లెక్చరర్లు ఒకే దగ్గర పనిచేస్తున్నారని
వీరిలో చాలా మంది ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్స్‌గా పనిచేస్తున్నారని సెక్రటరీ గుర్తుచేశారు. మొత్తం 17 క్యాడర్లలో 854 మందికి పదోన్నతలు ఇచ్చామని,1,928 మంది ఉద్యోగులను బదిలీ చేశామన్నారు. బదిలీలకు సంబంధించి సందేహాలను, సమస్యలను తీర్చడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించామని చెప్పారు. మొత్తం 789 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు.