- అందులో టీచర్లు, లెక్చరర్లు, వార్డెన్ పోస్టులే ఎక్కువ
- ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్యకే సెక్రటరీగా అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసైటీలో అధికారులు, ఉద్యోగుల ఖాళీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతినెలా అధికారులు, ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఖాళీ అవుతున్న పోస్టుల సంఖ్యకు.. రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన పోస్టులకు.. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల పోస్టులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది.
ఈ పోస్టులను భర్తీ చేయాలని సొసైటీ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు ప్రతిపాదనలు పంపినా.. అక్కడి నుంచి స్పందన రావడం లేదు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈ ఐ ఎస్)కు రాష్ట్ర వ్యాప్తంగా 9,735 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 5,763 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
అంటే.. సుమారు 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి పోస్టులు అయిన అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అకౌంటెంట్, సెక్రటరీలు మొదలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, వార్డన్లు, హాస్టల్స్ కు సెక్యూరిటీగా ఉండే వాచ్ మెన్ పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా హెడ్ ఆఫీస్ లో ఉండే కొంత మంది ఉన్నతాధికారులు రెండు మూడు పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి 6 పోస్టుల బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం.
తీవ్ర పనిఒత్తిడితో విధులు నిర్వర్తించలేకపోతున్నామని ఆ అధికారి పేర్కొంటున్నారు. దీంతో పలువురు అధికారులు ఎస్సీ గురుకుల సొసైటీకి పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. సొసైటీని ఎంతో డెవలప్ చేయాలని పలు ప్లాన్స్ పై అధికారులతో చర్చిస్తున్నా.. టైమ్ లేకపోవడంతో వాటి అమలు నిదానంగా సాగుతోందని
అధికారులు అంటున్నారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అనుమతివ్వండి
ఎస్సీ గురుకుల సొసైటీలో రెగ్యులర్ పోస్టులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని అధికారులు భావించారు. నిధుల కొరత కారణంగా రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఫైనాన్స్ అధికారులను సొసైటీ కోరింది. వివిధ క్యాడర్లలో కలిపి మొత్తం 4,725 పోస్టులకు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 4 వేల పోస్టులకే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అనుమతి ఇచ్చిందని ఓ అధికారి తెలిపారు.
