
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ వ్యాఖ్యలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టులను రాజకీయాల కోసం వాడుకోవద్దని.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు చురకలంటించింది. ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాహుల్ ఓట్ చోరీ వ్యాఖ్యలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. సోమవారం (అక్టోబర్ 13) న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. రాజకీయ అంశాలకు న్యాయస్థానాలను వేదికలు చేసుకోవద్దని పిటిషనర్‌ను మందలించింది.
ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది ధర్మాసనం. అయితే.. ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేశామని.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు కోర్టు అంగీకరించలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది ధర్మాసనం.