భారత్ పరువు తీస్తున్నరు: వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం

భారత్ పరువు తీస్తున్నరు: వీధి కుక్కల కేసులో రాష్ట్రాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆ‍గ్రహం

న్యూఢిల్లీ: వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణ 2025, నవంబర్ 3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అధికారులు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. విధి కుక్కల నియంత్రణలో విఫలమై ప్రపంచదేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాగా, వీధి కుక్కలకు సంబంధించి 'ఇన్ ఎ సిటీ హండెడ్ బై స్ట్రేస్, కిడ్స్ పే ప్రైస్' అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు 2025, ఆగస్టు 22న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జంతు జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ క్రమంలో 2025, అక్టోబర్ 27న ఈ పిటిషన్‎పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. వీధి కుక్కల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి మెజార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అఫిడవిట్లు సమర్పించలేదు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మాత్రమే అఫిడవిట్ దాఖలు చేశాయి. 

దీంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్లు సమర్పించడంలో విఫలమైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని.. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెండు నెలలు గడిచినా స్పందన లేదని.. అంటే దీని అర్థం ఏంటని ప్రశ్నించింది. 

తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని, వీధి కుక్కల దాడులపై రోజూ మీడియాలో వార్తలు వస్తున్నా.. అవి అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి.. కుక్కల బెడద కూడా కారణమని వ్యాఖ్యానించింది.

అనంతరం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి విచారణ 2025, నవంబర్ 3న అధికారులు సుప్రీంకోర్టు ముందు స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అధికారులు హాజరుకాకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.