
టీఆర్ఎస్ నాయకుడు, డీసీసీబీ డైరెక్టర్, జెడ్పీటీసీ భర్త ఇంటూరి శేఖర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దున్నపోతుల సురేష్ ప్రశ్నించారు. అకారణంగా తనకు సంబంధం లేని విషయంలో ఇంటూరి శేఖర్ తలదూర్చి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడని.. పూర్తి ఆధారాలు ఉన్నా పోలీసులు కేసు నమోదు చేయకుండా పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. ఇంటూరి శేఖర్ పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని... లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఫిర్యాదు రిసిప్ట్ అడిగితే రెండు రోజులు ఆగి రమ్మని కూసుమంచి ఎస్ఐ అంటున్నారని తెలిపారు.
అసలేం జరిగింది ?
జీళ్ళచెర్వు గ్రామానికి చెందిన సమాచారం ఇవ్వాలని ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన దున్నపోతుల సురేష్ ఆర్టీఐ యాక్ట్ కింద దరఖాస్తు చేశాడు. అదే గ్రామానికి చెందిన ఇంటూరి శేఖర్ తలదూర్చి కేసులు పెట్టించి బట్టలు ఊడదీసి నిలబెడతా అంటూ బెదిరించాడని సురేష్ ఆరోపించారు. ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ నాగరాజు పిటిషన్ తీసుకున్నాడని, కానీ.. రెండో రోజు తమ పరిధిలోకి రాదని.. కేసు నమోదు చేయలేనని చెప్పాడన్నారు. వివిధ దళిత సంఘాల నాయకులు రోడ్డుపై ఆందోళన చేసినా..ఎస్ఐ స్పందించలేదన్నారు. మళ్లీ కూసుమంచి మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడం కారణంగానే పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయకుండా టీఆర్ఎస్ నాయకులకు పోలీసులు సేవ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.