రాష్ట్రంలో ఎస్సీ ఉపకు లాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కష్టాలు

 రాష్ట్రంలో ఎస్సీ ఉపకు లాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కష్టాలు
  •     ఉపకులం పేరు లేకుండా ధ్రువపత్రాలు ఇస్తున్న ఆఫీసర్లు
  •     పర్మినెంట్‌‌‌‌ అడ్రస్‌‌‌‌ లేకపోవడంతో పత్రాల జారీలో ఇబ్బందులు
  •     18 కులాలకు తహసీల్దార్లు, 41 కులాలకు ఆర్డీవోల సర్టిఫికెట్ల జారీ
  •     సమస్య పరిష్కరించాలని మంత్రులకు ఎస్సీ ఉప కులాల నాయకుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాలు నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్‌‌‌‌ జారీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. క్షేత్రస్థాయిలో అర్హులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ సవాలుగా మారింది. ముఖ్యంగా 59 ఎస్సీ ఉపకులాల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలు తమ ఉనికికి అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాల్లో 18 కులాలకు తహసీల్దార్లు నేరుగా సర్టిఫికేట్లు జారీ చేసే అధికారం ఉంది. మిగిలిన 41 ఉపకులాల వారు సర్టిఫికెట్ పొందాలంటే ఆర్డీవో లేదా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చాలా ఉపకులాలు సంచార జీవనం గడుపుతుండటం వల్ల వారి దగ్గర పాత రికార్డులు, వంశవృక్షం లేదా స్థానికతకు సంబంధించిన ఆధారాలు ఉండటం లేదు. 

దీనివల్ల అధికారులు సర్టిఫికెట్లు జారీ చేయడానికి నిరాకరిస్తున్నారు. ఆయా ఉప కులాల ప్రజలు తమకు క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయాలని అప్లికేషన్ పెట్టుకున్న సమయంలో దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదని, విచారణ కూడా చేయడం లేదని ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. దీంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎస్సీ ఉపకులాల నేతలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి సమస్యను ఆయనకు వివరించారు. 

అవగాహన లోపంతో ఇబ్బందులు..

ఎస్సీ వర్గీకరణలో కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వర్గీకరణపై ప్రజలకు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో పడుతున్నాయి. అనర్హులు తమ గ్రూపులోకి వస్తారేమోనన్న అసలైన బాధితులు భయపడుతున్నారు. ఎస్సీ జాబితాలోని చిందు, డొక్కల, బైండ్ల వంటి ఉపకులాలు తరచుగా వలస వెళ్తుంటాయి. వీరికి సొంత ఇల్లు లేదా స్థిర నివాసం లేకపోవడం వల్ల ‘స్థానికత’ నిరూపించుకోవడం కష్టమవుతోంది. కుల ధ్రువీకరణ కోసం 1950 కంటే ముందు తమ పూర్వీకులు అదే ప్రాంతంలో ఉన్నట్లు ఆధారాలు చూపాలని అధికారులు అడుగుతున్నారు. 

నిరక్షరాస్యత వల్ల ఈ వర్గాల వద్ద పాత సేత్వార్ లేదా భూమి రికార్డులు లేవు. చాలామంది విద్యార్థులు గతంలో కేవలం ఎస్సీ అని మాత్రమే సర్టిఫికేట్ తీసుకున్నారు. ఇప్పుడు ఉపకులాల వారీగా కొత్త సర్టిఫికేట్లు తీసుకోవాలంటే పాత సర్టిఫికేట్లను రద్దు చేసి, ఆయా ఉపకులాల ప్రజలను విచారించి, ఉప కులాల పేర్లతో క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. 

స్పెషల్ డ్రైవ్‌‌‌‌లు చేపట్టాలి..

ప్రతి గ్రామంలో రెవెన్యూ లేదా సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్‌‌‌‌లు నిర్వహించి స్పాట్ వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉప కులాల సంఘ నాయకులు కోరారు. రికార్డులు లేని పక్షంలో గ్రామ సభ లేదా పెద్దల సాక్ష్యాన్ని ప్రామాణికంగా తీసు కుని సర్టిఫికెట్లు జారీ చేసే అధికారాన్ని స్థానిక అధికారులకు ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టరేట్లలో ఎస్సీ ఉపకులాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, వారి ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని ఉప కులాలకు తహసీల్దార్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.. 

ఎస్సీ ఉపకులాలపై అధికారులు అవగాహన కల్పించుకోవాలి. ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలకు తహాశీల్దార్లు పూర్తిస్థాయి విచారణ చేశాకకే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఉప కులాల ప్రజలు 20 లక్షల మంది ఉన్నారు. తండ్రి వివరాలు లేదా కుటుంబ వృత్తి ఆధారంగా స్థానిక విచారణ జరిపి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ను కలిసి వినతిపత్రాలు అందచేశాం. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
– బైరి వెంకటేశం, మోస్ట్ బ్యాక్‌‌‌‌వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్‌‌‌‌ కులాల హక్కుల పోరాట సమితి ఫౌండర్