CJP కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్.. ఎట్టకేలకు విచారణకు ఓకే చెప్పిన సుప్రీం కోర్టు

CJP కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్.. ఎట్టకేలకు విచారణకు ఓకే చెప్పిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్పై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు జులై 27న వాదనలు వినాలని నిర్ణయించింది. ఈ పిటిషన్లను సుప్రీం విచారణకు స్వీకరించడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ అంశంపై దాఖలైన రెండు వేరు వేరు పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది.

NEET పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర CJP మద్దతుదారులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ధర్నా సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జ్లో కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు అమానుషంగా లాఠీ ఛార్జ్ చేశారని పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల ప్రశ్నలకు లాఠీ ఛార్జ్ సమాధానం కాదని పలువురు సెలబ్రెటీలు కూడా ఈ లాఠీ ఛార్జ్ను ఖండించారు.

యువతపై లాఠీ ఛార్జ్ ను నిరసిస్తూ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఇంటి ముందు బైఠాయించడంతో ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలను చూడాలని, ఈ అంశాన్ని సుమోటోగా అత్యవసర విచారణకు స్వీకరించాలన్న లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తొలుత తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

‘‘మా సమయాన్ని, మీ సమయాన్ని వృథా చేయవద్దు. మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు. వాటిని చూడటానికి మా వద్ద సమయం కూడా లేదు. మెన్షనింగ్ దశలో ఎలాంటి వీడియో ఫుటేజ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించడానికి మేం సిద్ధంగా లేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

న్యాయవాది నరేంద్ర మిశ్రా బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరుల ప్రాథమిక హక్కులను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.

‘‘విద్యార్థులపై పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఆధారాలు నా వద్ద ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఈ అంశాన్ని గురువారం నాడే అత్యవసరంగా విచారణకు స్వీకరించండి” అని కోరారు. అయితే, ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషనర్ విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించారు.