సింగరేణి సీఎండీ బలరామ్‌‌‌‌కు బెస్ట్ సీఎండీ అవార్డు

సింగరేణి సీఎండీ బలరామ్‌‌‌‌కు బెస్ట్ సీఎండీ అవార్డు
  • ఏసియా పసిఫిక్ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎం కాంగ్రెస్ జాతీయ స్థాయి సదస్సులో పురస్కారం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరామ్‌‌‌‌కు దక్షిణ భారత అత్యుత్తమ సీఎండీ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన ఏసియా పసిఫిక్ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఎం కాంగ్రెస్ జాతీయ స్థాయి సదస్సులో ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు.సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ఏడాది కాలంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో పాటు, వ్యాపార విస్తరణ చర్యల ద్వారా సంస్థకు గట్టి ఆర్థిక పునాదులు వేసినందుకు బలరామ్‌‌‌‌కు ఈ గౌరవం దక్కింది. సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో ఫైనాన్షియల్ ఇంజినీరింగ్ ప్రక్రియను చేపట్టి, సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

 అంతేకాకుండా, వ్యాపార విస్తరణలో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో కర్నాటకలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌‌‌‌ను సాధించడం, రాజస్తాన్‌‌‌‌లో సోలార్, థర్మల్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందాలు  కుదుర్చుకోవడం వంటి చర్యల్లో ఆయన ప్రత్యేక చొరవ చూపారు. కార్మికులందరికీ రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 20 వేలకు పైగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఈ అవార్డుకు మరింత బలం చేకూర్చాయి. ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ..“ఈ గుర్తింపు సింగరేణి కార్మికులు, అధికారుల సమిష్టి కృషికి లభించిన ఫలితం. రానున్న రోజుల్లో సింగరేణిని విశ్వవ్యాప్త స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ అంకితభావంతో కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.