ఫామ్‌‌హౌస్‌‌లో సీన్ రీకన్‌‌స్ట్రక్షన్‌‌.. నానక్‌‌రామ్‌‌గూడ సర్వీస్ అపార్ట్మెంట్‌‌కు భగీరథ్‌ను తీసుకెళ్లి..

ఫామ్‌‌హౌస్‌‌లో సీన్ రీకన్‌‌స్ట్రక్షన్‌‌.. నానక్‌‌రామ్‌‌గూడ సర్వీస్ అపార్ట్మెంట్‌‌కు భగీరథ్‌ను తీసుకెళ్లి..
  • బండి భగీరథ్‌‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
  • డిసెంబర్ 31న జరిగిన పార్టీ వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌
  • నేడు నానక్‌‌రామ్‌‌గూడ సర్వీస్ అపార్ట్మెంట్‌‌కు భగీరథ్‌‌ !

హైదరాబాద్, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో బండి భగీరథ్‌‌ను పేట్‌‌బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. భగీరథ్‌‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం మేడ్చల్ జిల్లా సెషన్స్‌‌ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలు రిమాండ్‌‌లో ఉన్న భరగీథ్‌‌ను బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు తమ అదుపులోకి తీసుకొని మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్ మండలం కాశీంభౌలి గ్రామ పరిధిలోని అరణ్య ఫామ్‌‌హౌస్‌‌కు తరలించారు. డీసీపీ రితిరాజ్‌‌ ఆధ్వర్యంలో గంటన్నర పాటు విచారించారు. 

న్యూ ఇయర్ పార్టీలో ఏం జరిగింది..
డిసెంబర్‌‌‌‌31న రాత్రి పార్టీలో ఏం జరిగిందో తెలుసుకున్నారు. బాలిక సహా స్నేహితులతో కలిసి మద్యం తాగిన సన్నివేశాలకు సంబంధించి సీన్ రీ కన్‌‌స్ట్రక్షన్ చేశారు. భగీరథ్‌‌తో పాటు బాలిక కూర్చున్న ప్రాంతాలను మ్యాపింగ్‌‌ చేశారు. అనంతరం షాపూర్‌‌‌‌ నగర్‌‌‌‌లోని కూకట్‌‌పల్లి డీసీపీ ఆఫీస్‌‌కు తరలించారు. 

కాగా మొదటి రోజు కస్టడీ విచారణలో భగీరథ్‌‌ వ్యక్తిగత వివరాలతో పాటు స్నేహితుల వివరాలను సేకరించినట్లు తెలిసింది. సాయంత్రం 6 గంటల వరకే విచారించాలన్న కోర్టు నిబంధనల మేరకు వ్యవధిలోనే ఎంక్వైరీ పూర్తి చేశారు. గురువారం నానక్‌‌ రామ్‌‌గూడలోని అపార్ట్​మెంట్​కు వెళ్లనున్నట్లు తెలిసింది.