
- ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ.. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్
- అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్
- మొత్తం 5,763 ఎంపీటీసీ, 566 జడ్పీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలు
- రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు రెడీ
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించనుంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జడ్పీ చైర్పర్సన్పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల గెజిట్ను ప్రభుత్వం ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. వీటిని ఎస్‌ఈసీ పూర్తిస్థాయిలో పరిశీలించి ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. అయితే రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండటం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడంతో.. న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించినట్టు తెలిసింది. అడ్వొకేట్జనరల్ఒపీనియన్కూడా తీసుకున్నట్టు సమాచారం. కోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో ఆ తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్చేసేలా ఎస్‌ఈసీ ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత సర్పంచ్ఎన్నికలు కూడా రెండు దశల్లో, అవసరమైన జిల్లాల్లో మూడు దశల్లో నిర్వహించనున్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్10–15వ తేదీలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయనున్నారు.
2019లో 12,750 జీపీలు..
2019లో 12,750 జీపీలకు, 1,13,136 వార్డులకు, 539 జడ్పీటీసీ, 538 ఎంపీపీ, 5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 32 జడ్పీలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పుడు వాటి 31కి తగ్గింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఆ జిల్లా ఔట్ అయింది.
మహిళా ఓటర్లే కీలకం..
రాష్ట్రవ్యాప్తంగా 12,760 సర్పంచ్, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి 566 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నిక లేకపోవడంతో వీటి సంఖ్య ఒకటి తగ్గింది. 31 జడ్పీ స్థానాలకు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల రిజర్వేషన్లతోపాటు పీఆర్కమిషనరేట్ఆఫీస్ నుంచి జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్పత్రాలను ఎస్ఈసీకి ఆదివారం రాత్రి పీఆర్అధికారులు అందించారు. అయితే, వీటికి సంబంధించిన స్కాన్కాపీలు కూడా పంపించాలని ఎన్నికల సంఘం కోరడంతో అన్ని జిల్లాల అధికారులు పంపించారు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో పోలింగ్కేంద్రాలు సిద్దం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 31,371 పోలింగ్కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాలు సైతం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,87,03,168 మంది ఓటర్లలో 85,36,770 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు ఉండగా 504 మంది ఇతరులు ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దీంతో వాళ్ల ఓట్లే కీలకం కానున్నాయి.