ఓట్ల వేటలో తెచ్చే స్కీంలు మేలు చేయవు

ఓట్ల వేటలో తెచ్చే స్కీంలు మేలు చేయవు

ఛలో ఇంద్రవెల్లి సభ విజయవంతమైందని..సభ సక్సెస్ కావడానికి భారీగా తరలివచ్చిన ప్రజలకు,కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ ముఖ్య నాయకులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇంద్రవెల్లి సభ సక్సెస్ పై పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. ఇందులో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క.. ఎంత మంది మభ్యపెట్టిన కాంగ్రెస్ సభకు లక్షమంది కంటే ఎక్కువే హాజరయ్యారని తెలిపారు. 40 ఏళ్లలో ఎప్పుడు జరగనంత గొప్పగా ఛలో ఇంద్రవెల్లి సభ జరిగిందన్నారు. ఎన్ని ఆంక్షలున్నా ధిక్కరించి వచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలుంటేనో, సభ ఉంటేనో తప్ప ప్రజల సంక్షేమం టీఆరెస్ నేతలకు గుర్తుకు రావడం లేదని ఆరోపించారు. పోడు భూములపై అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెప్తున్నారన్నారు. తాము సభ పెట్టగానే పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఓట్ల వేటలో తెచ్చే స్కీంలు మేలు చేయవన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీతక్క. కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సభలు నిర్వహిస్తామన్న సీతక్క.. కొంతమంది పోలీసులు నాయకుల వ్యక్తిగత ఎజెండాను మోస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.


ఇంద్రవెల్లి సభ విజయవంతమైంన్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్.. గిరిజన, హరిజన సభను TRS నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. పోడు భూములకు హక్కులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరానికైనా పట్టా ఇచ్చారా అని అన్నారు. సిరిసిల్ల, ఖమ్మం లలో  దళితులపై దాడులు చేసింది నిజం కదా అని అన్నారు. మూడెకరాల పొలం, దళిత సీఎం ఇలా ఏ హామీని కేసీఆర్ అమలు చేయలదని ఆరోపించారు బలరాం నాయక్. దళితులకు 10లక్షలు అమలు సాధ్యమైయ్యేదేనా? పూర్తిస్థాయిలో అమలు చేయగలరా అని అడిగారు.

 
కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మరో నేత అద్దంకి దయాకర్. మీకు ప్రాధాన్యత లేకపోతే కేసీఆర్ కాళ్ళు మొక్కండి ప్రాధాన్యత ఇస్తారు.. రేవంత్ పై విమర్శలు చేస్తే ప్రాధాన్యత రాదన్నారు. కాంగ్రెస్ కొడుకులు, కాంగ్రెస్ నేతలను సన్నాసులు అన్నప్పుడు పార్లమెంటరీ బాషా గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ఏడేళ్లలో దళిత గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్న దయాకర్..దళిత బంధు గిరిజనులకు అమలు చేయాలని డిమాండ్ చేయడం తప్పా అని అన్నారు. మాకెందుకు దళిత బంధు ఇవ్వరని ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, అవినీతిపరులకు చంచల్ గూడా జైల్ తిండి తినిపిస్తామన్నారు.


TRS నేతలు రోజులు లెక్కబెట్టుకోవాల్సిన రోజు వచ్చిందని.. రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్. ఇంద్రవెల్లి సభపై బిస్కెట్ బ్యాచ్ ఇష్టారీతిన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించినప్పుడు దళిత ఎమ్మెల్యేలు ఎక్కడపోయారని ప్రశ్నించారు. దళిత బంధు ఎన్నికల కోసమే అని సీఎం కేసీఆర్ అంటే టీఆరెస్ సన్నాసులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.