- ఆర్ కృష్ణయ్య డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించి, 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల మూసివేతతో పేద, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పాఠశాలల మూసివేతతో డ్రాప్ ఔట్లు పెరిగి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, డా.కప్పుల అన్వేశ్, పరిపూర్ణ చారి, డా.రాజీవ్ పాల్గొన్నారు.
