15 రోజులుగా 500 మంది పిల్లలు ఇండ్లలోనే

15 రోజులుగా 500 మంది పిల్లలు ఇండ్లలోనే
  • మంత్రి కొప్పుల నియోజకవర్గంలో ఇదీ దుస్థితి
  • గొల్లపల్లి ఎస్సీ గురుకులంలో దారుణంగా పరిస్థితులు
  • కిటికీలకు డోర్లు లేక క్లాస్‌‌ రూముల్లోకి వాననీళ్లు
  • గదుల్లోకి పాములు, తేళ్లు వస్తున్నయంటున్న స్టూడెంట్లు

జగిత్యాల, వెలుగు: స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లిలోని ఎస్సీ బాయ్స్ గురుకులానికి మాత్రం ‘వానాకాలం సెలవులు’ ఇచ్చారు. ఎందుకంటే ఇటీవలి వర్షాలకు ఇక్కడి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్​ పూర్తిగా దెబ్బతిన్నది. గోడలు, స్లాబ్‌‌ ఉరుస్తున్నయ్. కిటికీలకు డోర్లు లేక రూముల్లోకి వాన నీళ్లు వస్తున్నాయి. బిల్డింగ్​చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో బిల్డింగ్ కూలుతుందన్న భయంతో క్లాసులను బంద్ పెట్టారు. 500 మంది స్టూడెంట్లను ఇండ్లకు పంపించేశారు. 15 రోజులవుతున్నా ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.గొల్లపల్లిలోని ఎస్సీ గురుకులానికి  సొంత బిల్డింగ్ లేకపోవడంతో ఆఫీసర్లు ఓ ప్రైవేట్​బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఏమాత్రం క్వాలిటీ లేకుండా నిర్మించిన ఈ బిల్డింగ్ ఇటీవలి వానలకు దారుణంగా తయారైంది. వర్షం పడితే చాలు, గోడలు, స్లాబ్ ఉరుస్తున్నాయి. కిటికీలకు డోర్స్ లేకపోవడంతో హాస్టల్ రూముల్లోకి వాన నీరు చేరుతోంది. రాత్రిళ్లు వానపడితే పడుకునే పరిస్థితి లేకపోవడంతో స్టూడెంట్స్ తెల్లవార్లు జాగారం చేస్తున్నారు. ఈ బిల్డింగ్ లోతట్టు ప్రాంతంలో ఉండటంతో చుట్టూ నీరు చేరి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వరద నీటి వల్ల గురుకులం ప్రాంగణంలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 15 రోజుల కిందట ప్రహరీ గోడ కూలింది. అదృష్టవశాత్తు స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఏమీ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్కూల్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించలేమంటూ ప్రిన్సిపల్, టీచర్లు చేతులెత్తేశారు. పై ఆఫీసర్ల నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకుని 15 రోజుల కిందట సెలవులు ప్రకటించారు. దీంతో స్టూడెంట్లంతా ఇండ్లకు వెళ్లిపోయారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలే

ఎస్సీ బాలుర గురుకులంలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 480 మంది చదువుతున్నారు. వీరితో పాటు 80 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ బిల్డింగ్ దెబ్బతినడంతో టెన్త్ చదువుతున్న 60 మందికి తప్ప అందరికీ సెలవులు ఇచ్చేశారు. దీంతో 500 మంది స్టూడెంట్స్ 15 రోజులుగా ఇండ్లకే పరిమితమయ్యారు. క్లాసులు లేకపోవడంతో నష్టపోతున్నామని చెప్తున్నారు. పిల్లల భవిష్యత్‌‌‌‌‌‌‌‌పై పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రెండు వారాలు గడుస్తున్నా ఆఫీసర్లు ఆల్టర్నేట్​ఏర్పాట్లు చేయకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.


త్వరలోనే ప్రారంభిస్తం

సరైన వసతులు లేకపోవడం వల్లే స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఇండ్లకు పంపించాం. వేరే బిల్డింగ్ కోసం వెతుకుతున్నాం. ఈ స్కూల్‌‌‌‌‌‌‌‌ను ధర్మపురి మండలం మగ్గిడి సర్కార్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోకి తరలించేలా పరిశీలిస్తున్నాం. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం.

- ఎస్.రఘుపతి, ప్రిన్సిపల్, 
గొల్లపల్లి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్

వానొస్తే నీళ్లు లోపలికొస్తున్నయి

మాది పెద్దపల్లి. గొల్లపల్లి గురుకులంలో చేరాను. ఇక్కడ కనీసం పడుకోవడానికి సరైన బెడ్స్ లేవు. క్లాస్ రూమ్‌‌‌‌‌‌‌‌లు సరిపోక ఒక్క గదిలోనే రెండు క్లాసులు నడుపుతున్నారు. వానొస్తే కిటికీల ద్వారా నీళ్లు లోపలికి వస్తున్నాయి. వాష్ రూమ్స్ బాగాలేవు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టడం లేదు.

- శ్రీ హర్షన్, స్టూడెంట్