స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే అసలు దీనికి కారణం విద్యా సంస్థల్లో టీచర్ల టార్చర్ అని తేలుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రెవా జిల్లాలో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి మరవక ముందే దేశ రాజధాని ఢిల్లీలో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భారతీయ విద్యా విధానంపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.
తాజాగా ఢిల్లీలో జరిగిన దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ప్రముఖ పాఠశాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం.. దాని వెనుక ఉన్న కారణాలు తల్లిదండ్రులను, సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. బాలుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొంతమంది ఉపాధ్యాయులు తన కుమారుడిని మానసికంగా వేధించారని, తరగతిలో అవమానపరిచారని తెలిపారు. అయితే ఈ ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త అష్నీష్ గ్రోవర్ స్పందించారు. ప్రస్తుతం పెద్ద నగరాల్లో స్కూళ్లు క్లబ్స్ లాగా మారాయని.. వాటిలో అడ్మిషన్ పొందటం సవాలుగా మారిందన్నారు. స్టేషస్ సింబల్ గా మారిన ఈ స్కూళ్ల యాజమాన్యాలు కూడా క్లబ్ ఓనర్లుగా ప్రవర్తిస్తున్నారని.. విద్య నేర్పించే విధంగా ప్రవర్తించటం లేదన్నారు. ప్రస్తుతం విద్య ఒక వృత్తి కాకుండా “క్లబ్ కల్చర్” అవుతోందని విమర్శించారు.
ఒక ఉపాధ్యాయురాలు అతనికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తానని బెదిరించగా, డ్రామాటిక్స్ క్లాస్‌లో పడిపోతే ఒక టీచర్ “నీకు డ్రామా బాగా వస్తుంది కదా!” అని వ్యంగ్యంగా మాట్లాడినట్లు వెల్లడైంది. విద్యార్థి మరణించిన తర్వాత స్కూల్ యాజమాన్యం రెండు రోజులకే పాఠశాల ముగ్గురు ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయురాలని సస్పెండ్ చేసింది. వారిని విద్యార్థులతో లేదా సిబ్బందితో సంబంధాన్ని నిషేధించింది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు రోజులలోపే నివేదిక సమర్పించాల్సి ఉంది.
మహారాష్ట్రలోని సాంగ్లీలో బాలుడి అంత్యక్రియలు జరిపారు. తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడు పాఠశాల మార్చమని అనేక సార్లు అడిగాడని, కానీ వచ్చే ఏడాది మార్చతానని చెప్పానని కన్నీరుమున్నీరయ్యారు. స్నేహితుల మాటల్లో అతను క్రియేటివ్ పర్సన్ అని, స్పోర్ట్స్ లవరని తేలింది. నటుడవ్వడం అతని కల అని తెలిసిందని చెప్పారు.
