మన ఊరు మన బడి : ఫిబ్రవరి1న స్కూళ్లు ప్రారంభం

మన ఊరు మన బడి :  ఫిబ్రవరి1న స్కూళ్లు ప్రారంభం

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పనులు పూర్తైన స్కూళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో 12 రకాల వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.