వర్షాకాలంలో రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

వర్షాకాలంలో రైళ్ల భద్రతకు ప్రత్యేక చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: భారీ వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్​కుమార్ శ్రీవాస్తవ ఆదేశించారు. రైళ్ల నిరంతరాయ రాకపోకల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని ‘రైల్ నిలయం’లో ఆయన ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. వర్షాకాలంలో మౌలిక సదుపాయాలకు, రైళ్ల కార్యకలాపాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, భద్రతా నియమాలను ఎక్కడా రాజీ పడకుండా పాటించాలని స్పష్టం చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, మట్టికోతకు గురయ్యే అవకాశం ఉన్న రైల్వే కట్టలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కట్టల సామర్థ్యాన్ని కాపాడేందుకు అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్, బండరాళ్లు వంటి సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.