రైల్వే పార్శిళ్లు ఇంటి దగ్గరికే...! డోర్ డెలివరీ సేవలకు దక్షిణ మధ్య రైల్వే రెడీ..

రైల్వే పార్శిళ్లు ఇంటి దగ్గరికే...! డోర్ డెలివరీ సేవలకు దక్షిణ మధ్య రైల్వే రెడీ..
  • వినియోగదారుల ఇంటి నుంచే పార్శిల్స్​ పికప్.. ప్రజలకు చేరువలో లాజిస్టిక్​ సేవలు 
  • కొత్తగా యాప్​ను రూపొందిస్తున్న రైల్వే అధికారులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మారిన కాలంలో వినియోగదారులకు ముంగిట్లోకే సేవలు అందించేందుకు వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. డోర్​ డెలివరీ అన్నది ఇప్పుడు దాదాపు అన్ని రకాల వస్తువుల కొనుగోలుకు వ్యాపారులు అన్వయిస్తున్నారు. డోర్​ డెలివరీ సేవలు అందించడం ద్వారా ఆయా సంస్థలు భారీఎత్తున లాభాలు దండుకుంటున్నాయి. మొన్నటికి మొన్న టీజీఎస్​ ఆర్టీసీ కూడా లాజిస్టిక్​ రంగంలోకి ప్రవేశించి వివిధ రకాల వస్తువులను రవాణా చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాకుండా ఉచిత డోర్​ డెలివరీ సదుపాయాన్ని కల్పించడంతో ప్రస్తుతం ఆర్టీసీకీ లాజిస్టిక్​ వ్యాపారం ద్వారా కూడా మంచి లాభాలు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

తాజాగా దేశ వ్యాప్తంగా నెట్​వర్క్​ కలిగి ఉన్న దక్షిణమధ్య రైల్వే కూడా వినియోగదారులకు డోర్​డెలివరీ సేవలను అందించేందుకు ముందుకు వస్తోంది. సాధారణంగా దూర ప్రాంతంలో ఉన్న స్నేహితులు, బంధువులకు ఏదైనా వస్తువులను పంపాలంటే రైల్వే పార్శిల్​విభాగానికి వెళ్లి వాటిని బుక్​చేసి పంపాల్సి ఉంటుంది. అక్కడ వస్తువులను పొందే వారు కూడా సదరు రైల్వేపార్శిల్​ కేంద్రానికి వెళ్లి పార్శిళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. 

కానీ, ఇక నుంచి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైల్వే శాఖ నేరుగా పార్శిళ్లను ఇంటి నుంచే పికప్​చేసి చేరాల్సిన వ్యక్తులకు కూడా వారి ఇంటికి చేర్చేలా సేవలు అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్​ను రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ఆ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుంటే చాలు ఎక్కడికైనా పార్శిళ్లను పంపడం, అందుకోవడం ఇక సులభతరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ మాదిరిగానే రైల్వే కూడా లాజిస్టిక్ సేవల్లో గణనీయ మార్పునకు శ్రీకారం చుడుతున్నది. సరుకుల రవాణా, డెలివరీల్లో డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించడం రైల్వేశాఖ చేస్తున్న మొట్టమొదటి ప్రయోగమని అధికారులు తెలిపారు. 

సేవలు ఎలా అందిస్తారంటే..

దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఓ లాజిస్టిక్ యాప్​ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ యాప్​ను డౌన్​లోడ్​చేసుకుని కస్టమర్లు బుక్ చేసుకుంటే సరుకులను ఇంటి వద్దకే వచ్చి తీసుకెళ్తారు. అలాగే, సంబంధిత అడ్రస్ లో డోర్ డెలివరీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ ప్యాసింజర్ లేదా పార్శిల్ రైళ్ల ద్వారా పార్శిల్ బుక్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఈ సేవలు అందించనున్నారు. ఈ అప్లికేషన్​ ను మొదట పైలట్ ప్రాజెక్ట్​గా దక్షిణమధ్య రైల్వే జోన్  హైదరాబాద్ డివిజన్ లో అమలు చేయాలని నిర్ణయించారు. 

ఈ విషయంలో ఆసక్తిగల పార్టీలు లేదా ఏజెన్సీలను ఫస్ట్ మైల్ (పికప్) అండ్​ లాస్ట్ మైల్ (డెలివరీ) సేవలను మిడ్ మైల్ (రైల్వే ద్వారా రవాణా) తో సమన్వయ పరిచే విధంగా లాజిస్టిక్స్ సేవలను అందించడానికి ఉబర్​వంటి సర్వీస్​ ప్రొవడైర్లు, జెప్టో, బ్లింక్​ఇట్, బిగ్​బాస్కెట్, స్విగ్గీ ఇన్​స్టా మార్ట్, డిమార్ట్​ రెడీ వంటి సంస్థలను రైల్వేతో భాగస్వామ్యం చేసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ  సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న సర్వీస్​ ప్రొవైడర్లు నేరుగా హైదరాబాద్ డివిజన్‌‌‌‌లోని వాణిజ్య విభాగాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. నెక్స్ట్ జెన్  రైల్ పార్శిల్ యాప్ పార్శిల్ సరుకులను బుకింగ్ చేయడానికి, సరుకులను ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి వన్-స్టాప్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. 

యాప్ వల్ల  ప్రయోజనాలు..

రైల్వే అధికారులు సరికొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ లాజిస్టిక్​ యాప్​ వల్ల ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరలో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అలాగే, కచ్చితమైన సమయపాలనకు అవకాశం ఉంటుందంటున్నారు. ఆన్‌‌‌‌లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు, రియల్ టైమ్ పార్శిల్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు కలిసివస్తాయని అంటున్నారు. సజావుగా ఎండ్- టు- ఎండ్ సర్వీస్ – పార్శిల్ ను ఇంటి నుంచి బుక్ చేసుకొని వాటిని తీసుకొని గమ్యస్థానంలోని ఇంటికి అందించడం చాలా సులువవుతుందని తెలిపారు. అంతే కాకుండా మెరుగైన పారదర్శకత, చెల్లింపు సౌలభ్యం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. ఈ సేవ వినియోగదారులకు ఇంటివద్దకే అందించడం ద్వారా పార్శిల్ రవాణాలో కీలకమైన మార్పుగా అభివర్ణించారు.