త్వరలో బీజేపీ దరఖాస్తుల స్క్రీనింగ్

త్వరలో బీజేపీ దరఖాస్తుల స్క్రీనింగ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  బీజే పీ తరఫున పోటీ చేసేందుకు అశావహుల నుంచి వచ్చిన అప్లికేషన్ల పరిశీలనకు రాష్ట్ర పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నెల 4 నుంచి 10 వరకు స్వీకరించిన 6వేలకు పైగా అప్లికేషన్లను నియోజకవర్గాల వారీగా వేరుచేసే ప్రక్రియ గురువారంతో  పూర్తయ్యింది. ఇక వీటిని స్క్రీనింగ్  చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి  67 దరఖాస్తులు,  ముషీరాబాద్​కు 50కి పైగా వచ్చినట్లు సమాచారం. అతి తక్కువగా నర్సాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు వచ్చినట్లు తెలిసింది. కల్వకుర్తికి 3, నర్సాపూర్ కు  4 మాత్రమే దరఖాస్తులు అందినట్లు తెలుస్తున్నది. అప్లికేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  సుమారు15 మందితో  రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించనున్నట్లు చర్చ సాగుతున్నది. ఈ కమిటీనే స్క్రీనింగ్ తర్వాత నియోజకవర్గానికి ముగ్గురిని చొప్పున ఫైనల్ చేయనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండనున్నారు.