సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజాప్రతినిధులు ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా, సమాజమే దేవాలయంగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మున్సిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు కలెక్టర్ హైమావతి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా విద్య, వైద్యం, పారిశుధ్యం తదితర రంగాల్లో అనేక అభివృద్ధిపై అవగాహన కార్యక్రమాలను అమలుచేసిందని గుర్తుచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సర్పంచుల కోసం జిల్లాలో ఇప్పటికే ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా ప్రణాళిక అధికారి దశరథ్ ఉన్నారు.
