కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ  - ఫైనల్ లిస్ట్ త్వరలోనే..!

కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ  - ఫైనల్ లిస్ట్ త్వరలోనే..!

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకం పంచాయితీకి తెర పడింది, త్వరలోనే తుది జాబితా గురించి అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది. మొన్న చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యాక టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరటం ఖాయమేనని తేలింది. ఈ నేపథ్యంలో 22న పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో సీట్ల విషయం చర్చించాక విపక్షాల పొత్తు గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

పొత్తులో భాగంగా జనసేనకు 30ఎమ్మెల్యే స్థానాలు, 3ఎంపీ స్థానాలు కేటాయించారని, బీజేపీకి 12ఎమ్మెల్యే స్థానాలు, 5ఎంపీ స్థానాలను కేటాయించారని తెలుస్తోంది. మొన్నటిదాకా జనసేనకు 25స్థానాలు మాత్రమే కేటాయిస్తారని ప్రచారం జరిగింది కానీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి 30స్థానాలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సీట్ల లెక్క జనసైనికుల్లో కాస్త అసంతృప్తి కలిగిస్తుందనే చెప్పాలి. టీడీపీతో పొత్తు పట్ల ఇప్పటికే చాలా మంది జనసేన కార్యకర్తలు అయిష్టంగా ఉన్నారు. దీనికి తోడు గొరవప్రదంగా 50 నుండి 60సీట్లు అయినా లేకుండా 30 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వటం ఇంకా అసంతృప్తికి గురి చేసే అంశం.

 అయితే చాలా చోట్ల టికెట్ ఆశిస్తున్న నేతలు త్యాగానికి సిద్దపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సీటును త్యాగం చేసినవారికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తామని పార్టీల అధిష్టానాలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.2014 ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.మరి, ఎన్నికల దగ్గరపడుతున్నప్పటికీ ఇంకా సీట్ల పంపకం దగ్గరే ఆగిపోయిన విపక్షాలు ఎన్నికలను ఎంత సమర్థవంతంగా ఎదురుకుంటాయో చూడాలి.